పిల్లల్లో ఒంటరితనం పారదోలాలంటే

ప్రస్తుతం ఉన్న సమాజంలో సామాజిక, ఆర్థిక, యాంత్రిక జీవితంలో తల్లిదండ్రులు కాస్త సమయం పిల్లలకు కేటాయించాలంటే అది చాలా కష్టమైపోతుంది. అదీకాక ఈ మధ్య ఒకే ఒక సంతానంతో తృప్తి చెందటం లేదా ఆ ఒక్కరినే బాగా చూడాలనీ, బాగా చదివించాలని తల్లిదండ్రులు కోటి ఆశల్ని కలిగిఉంటున్నారు. మరి మనపెద్దవాళ్ళు ఊరకే అనరు ఒక బిడ్డే అయితే వారికి తోడేది అని..అవును, ఇది నిజం. ఒక సంతానమే అయితే వారు ఒంటరితనం కు బానిసలైపోయి వారి మానసిక ఉల్లాసం దెబ్బతినటం మాత్రం ఖాయమే. అయితే తల్లిదండ్రులకు వారి పిల్లల్ని ఒంటరితనంలోపడకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాం. అవేంటో చూసేద్దామా..

1. ఇంట్లో ఒక్కరే ఉంటే ఎవరితో ఆడుకోవాలో తెలియదు. బయట స్నేహితులున్నా అదీ కాసేపే. ఇలాంటప్పుడు పేరెంట్స్ ఒంటరితనాన్ని పోగొట్టడానికి రోజులో ప్రత్యేకించి కొంత సమయం వారితో తప్పనిసరిగా గడిపేలా ప్రణాలిక చేసుకోవాలి. ప్రత్యేక శ్రద్ద వారిపై చూపాలి.

2. ఈ రోజుల్లో భార్యభర్త సంపాదనాపరులు అవడం, ఒక్కరే అని పిల్లలపై కానుకల వర్షం కురిపిస్తుంటారు. పిల్లల అవసరాలకు మించి ఇచ్చే ప్రతి కానుక వారికి చెడే చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చేస్తుంటే కష్టం అంటే ఏమిటో తెలుసుకోలేరు. ఫలితంగా జీవితంలో వచ్చే ఒడిదొడుకులను తట్టుకోలేరు.

3. ఈ ఆధునిక ప్రపంచంలో థియేటర్ ఆర్ట్స్ నుంచి ఆస్ట్రానమీ వరకు, కరాటే నుంచి పెయింటింగ్ వరకు, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్… ఒకటేమిటీ మల్టీ టాలెంట్‌కు కావల్సిన అవకాశాలు ఉన్నో ఉన్నాయి. వాటిని మీ బాబు లేదా పాప అందిపుచ్చుకోవడానికి అవకాశాలు కల్పించండి. ఒంటరితనం అనే భావనే వారి దరిచేరదు.

4. సాహిత్యాన్ని పరిచయం చేస్తే పుస్తకాల మీద ఆసక్తి పెరుగుతుంది. పుస్తకాలు స్నేహితుల లోటును భర్తీ చేస్తాయి. ఒంటరిగా ఉండే పిల్లలు టీవీ చూడటం, ఇంటర్‌నెట్ బ్రౌజింగ్‌తో కాలాన్ని వృధాగా గడిపేస్తుంటారు. అందుకని కచ్చితమైన సమయాన్ని మాత్రమే కేటాయించాలి.

5. ఫ్యామిలీ ఫ్రెండ్స్, బంధువులతో సందడిగా ఉండే వాతావరణాన్ని సృష్టించండి. కుటుంబ పరిధి పెరుగుతున్నా కొద్ది పిల్లలు ఒంటరివారమనే భావనకు దూరం అవుతారు.

6. అమ్మాయో, అబ్బాయో ఒక్కరే ఉంటే ఇంట్లో వారి దృష్టి అంతా వారి మీదకే మళ్లుతుంది. ఒక్కరే కదా అని అతి శ్రద్ధతో పిల్లలను స్వేచ్ఛను హరించడం వారి భవిష్యత్తుకు శ్రేయస్కరం కాదు. అడుగు వేస్తే కందిపోతారేమో అన్నంతగా చూస్తే పిల్లలు ఏ పని చేయడానినికైనా సొంత నిర్ణయం తీసుకోలేరు.

7. స్నేహితులుగా ఉండగలగే ఆహ్లాదకరమైన ఇంటి వాతావరణం, భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఉంటే ఒంటరి అనే భావనే పిల్లల దరిచేరదు.