ఆరోగ్యమైన దంతాలు కావాలంటే?

ఆకర్షణీయమైన నవ్వుకు మిలమిల మెరిసే పళ్ళు మరింత అందాన్నిస్తాయి. ముఖంలో పళ్ళు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. తళ తళలాడే పళ్ళు కావాలని అందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందుకే  ప్రొద్దున్నే పళ్ళను గట్టిగా తోముతుంటారు. పళ్ళని చాలా గట్టిగా తోమడంవల్ల పంటిపై ఉండే ‘ఎనామిల్’ అరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని పళ్ళమీద గట్టిగా బ్రష్ చేయకూడదు కానీ, పళ్ళ మధ్య ఇరుక్కున్న చిన్నిచిన్ని ముక్కలు పోయేలా సున్నితంగా బ్రష్ చేయాలి. ఆరోగ్యవంతమైన దంతాలకోసం కొన్ని జాగ్రత్తలను మీకోసం అందిస్తున్నాం. అవేంతో చూద్దామా?

 పళ్ళు తోమే విధానం:

బ్రష్‌ని నోట్లో ఒక పక్కగా పోనిచ్చి, పళ్ళపై గుండ్రంగా బ్రష్ చేయాలి. అంటే పై దంతాల్ని చిగుళ్ళపై నించి క్రిందికి కింది దంతాల్ని చిగుళ్ల కింద నించి పైకి బ్రష్ చేసుకోవాలి. పళ్ళ బయట శుభ్రం చేసినట్లే పళ్ళ వెనుక భాగం, నమిలే భాగం కూడా బ్రష్‌తో శుభ్రం చేయాలి.

పళ్ళ కోసం చెయ్యాల్సినవి:

1. గరుకు బ్రష్‌లతో పళ్ళను తోమడం వల్ల చిగుళ్ళు అరిగిపోయే ప్రమాదముంది. మెత్తటి కుచ్చులున్న బ్రష్‌లనే వాడాలి.

2. రకరకాల టూత్ పేస్టులని వాడడం మంచిది కాదు.టూత్‌పేష్ట్‌ని బ్రష్ కుచ్చుల్లోకి చొచ్చుకు పోయేలా వేసుకోవాలి. గరుకుగా ఉండే పొడులతో కూడా పళ్ళను తోమడం మంచిది కాదు.

3. పళ్ళ పొడితో తోముకోదలిస్తే పొడుం మెత్తగా వుండేట్లు చూసుకోవాలి. గరుకుపొడితో తోమితే పళ్ళ ఎనామిల్ దెబ్బతినవచ్చు. పళ్ళతో పాటు, చిగుళ్ళను కూడా మర్దన చేస్తూ తోమాలి.

4. కొందరు బ్రష్‌లని ఆరు నెలలకి పైగా కూడా వాడుతుంటారు. అంతకాలం బ్రష్ పాడవకుండా ఉన్నదీ అంటే వాళ్ళు బ్రష్‌ని సరిగ్గా వాడనట్టని అర్థం. కుచ్చులు నలిగిపోయిన బ్రష్‌తో పళ్ళని తోముకోవడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు బ్రష్లను మార్చాలి. ఎదైన తిన్నప్పుడు నోటిని పుక్కిలించుకోవాలి.

5. ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి పడుకొనబొయె ముందు రెండు సార్లు తప్పనిసరిగా బ్రష్ చెయాలి. ఊదయం అందం కొసం, రాత్రి ఆరొగ్యం కొసం

ప్లాసింగ్ పధ్ధతి: 

పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాల్ని తొలగించడానికి ‘ప్లాసింగ్’ అనే పద్ధతి ఎంతగానో తోడ్పడుతుంది. ‘డెంటల్ ప్లాస్’ (నైలాన్ దారం)ని పళ్ళ మధ్యకి పోనిచ్చి రెండు ప్రక్కలా దారాన్ని పట్టుకొని అటూ, ఇటూ కదిలిస్తే పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాలు బయటికి వచ్చేస్తాయి. ఇలా ప్లాసింగ్ చేసేటప్పుడు చిగుళ్ళు దెబ్బతినకుండా చూసుకోవడం అవసరం.

చేయకూడనివి:

పిన్నులు, సూదులు, అగ్గిపుల్లలు లాంటి వాటితో పళ్ళ మధ్య ఇరుక్కున్న పదార్థాల్ని తీయడం మంచిది కాదు. ఇలా చేయడంవల్ల పళ్ళ మధ్య సందులు ఏర్పడతాయి. ఏర్పడిన సందుల్లో ఆహార పదార్థాల ముక్కలు ఇరుక్కుని దంత వ్యాధులు వచ్చే అవకాశముంది.