దంత ‘ఆరోగ్యం’

చాలామందిలో పళ్ళు రంగు మారి కనపడుతుంటాయి. దీనికి కారణం వారు తీసుకునే సరైన సమ్రక్షణ వారి ఆహార అలవాట్లు, ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పలువరస బాగుండాలంటే పంటిలోని నాలుగు భాగాలూ ఆరోగ్యంగా ఉండాలి. పంటిలోని ఆ నాలుగు భాగాల భాగ్యాలుంటాయి. అవి మొదటిది పంటిపై ఉండే ఎనామెల్ పొర. రెండోది దాని కింద ఉండే డెంటిన్. ఆ తర్వాతవి పంటికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాలూ, నరాల చివరలు ఉండే భాగం. దీన్ని పల్ప్ అంటారు. వాటన్నిటి కింద ఉండే భాగం పంటి ఎముక. ఈ నాలుగూ ఆరోగ్యంగా ఉంటే పన్ను ఆరోగ్యంగా ఉన్నట్లే. చాలామంది పంటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నొప్పికి భయపడి చికిత్సను ఆలస్యం చేస్తుంటారు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న అధునాతన లేజర్ చికిత్స కారణంగా ఎలాంటి దంతసమస్యలనైనా చాలా సందర్భాల్లో నొప్పి ఏమాత్రం లేకుండానే (చాలా తక్కువ సందర్భాల్లో అతితక్కువ నొప్పితో) చికిత్స చేయడం సాధ్యమే.

కొందరిలో పళ్లరంగు మారి నల్లగా అవుతాయి. మరికొందరిలో అవి పసుపురంగులోకి మారిపోతాయి. ఇలా మారిన పళ్లను లేజర్ ద్వారా తెల్లగా మార్చవచ్చు. ఇలా లేజర్ బ్లీచింగ్ ప్రక్రియతో కేవలం అరగంటలోనే పంటిరంగును మార్చివేయవచ్చు. అలాగే నల్లటి చిగుళ్ల రంగును పింక్‌గా మార్చవచ్చు. దీన్ని లేజర్ కాస్మటిక్ డెంటిస్ట్రీ అంటారు. ఇక దంతాలకు వచ్చే సమస్యల్ని కొన్నింటిని తెలుసుకుందామా..

పిప్పిపళ్లు

ఒక ఆరోగ్యకరమైన పన్ను పిప్పిపన్నుగా మారే క్రమంలో ఎనామిల్, దానికింద ఉన్న డెంటిన్ మొదట దెబ్బతింటాయి. పిప్పిపన్ను మొదటి దశలో ఉన్నప్పుడు పన్నులోని మొదటి, రెండో భాగాలైన ఎనామిల్, డెంటిన్ దెబ్బతింటాయి. సాధారణంగా ఆ సమయంలో నొప్పి తెలియదు. అయితే ఇలా పన్ను శిథిలం అయినకొద్దీ పల్ప్‌ను తాకినప్పుడు రోగికి నొప్పి తెలుస్తుంది. పిప్పిపంటి సమస్యను ఈ దశకు చేరనివ్వకుండా నే, అనస్థీషియా అవసరం లేకుండానే లేజర్ కిరణాలను ప్రసరింపజేసి సమర్థంగా చికిత్స చేయవచ్చు.

చిగుళ్లవ్యాధి

చిగుళ్లను వైద్యపరిభాషలో ‘జింజివా’ అంటారు. దీనికి వచ్చే ఇన్ఫెక్షన్‌ను జింజివైటిస్‌గా చెబుతారు. ఈ జింజివైటిస్ సమస్య తీవ్రమైతే చిగుళ్ల చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్, పంటి ఎముకకు కూడా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ ఎముకకు చేరితే ఆ కండిషన్‌ను పెరియోడాంటైటిస్ అంటారు. చిగుళ్లవ్యాధి మొదటిదశలో ఉన్నప్పుడు అనస్థీషియా అవసరం లేకుండానే నొప్పి ఏమాత్రం తెలియకుండా లేజర్ చికిత్స చేయవచ్చు. ఒకవేళ చిగుళ్లవ్యాధి అడ్వాన్స్‌డ్ దశలోకి వెళ్తే ఆ సమయంలోనూ ఫ్లాప్ సర్జరీ చేస్తారు. ఈ సమయంలో ఎముక చుట్టూ ఉన్న చెడిపోయిన కణజాలాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియలో సైతం లేజర్ చికిత్స ద్వారా అతితక్కువ రక్తస్రావంతో చికిత్స చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా సంప్రదాయ చికిత్స చేసినప్పటికంటే లేజర్‌తో చికిత్స చేసినప్పుడు రోగి చాలా వేగంగా కోలుకుంటాడు.

నోటిలో పుండ్లు

సాధారణంగా నోటిలో వచ్చే పుండ్లలోని రకాలైన హెర్పిస్, ఆఫ్తస్, స్ట్రెస్ అల్సర్స్ వంటి వాటికి నొప్పి లేకుండా లేజర్ ద్వారా తక్షణ చికిత్స చేసే అవకాశం ఉంది.

బయోస్టిమ్యులేషన్

మన కణజాలంలో చెడిపోయిన వాటిపైన అతితక్కువ మోతాదులో లేజర్ కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా కణాలను ఉత్తేజపరచి అవి వేగంగా కోలుకునేలా చేయవచ్చు. ఈ ప్రక్రియను బయోస్టిమ్యులేషన్ అంటారు. దీనిద్వారా చిగుళ్ల వ్యాధుల సర్జరీ, జ్ఞానదంతం తొలగించేందుకు చేసే శస్త్రచికిత్సల్లో అయిన గాయాలను త్వరగా నయమయ్యేలా చేయవచ్చు.

రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్

నాలుగు భాగాల్లో చివరిదైన పంటి ఎముక వరకు చేరితే రూట్‌కెనాల్ చికిత్స అవసరమవుతుంది. రూట్‌కెనాల్ చికిత్సలో లేజర్‌ను ఉపయోగించి అక్కడి బ్యాక్టీరియాను నిర్వీర్యం చేస్తారు. దాంతో అక్కడ ఉండే సూక్ష్మక్రిముల నిర్మూలన జరుగుతుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్స్‌ను నివారించవచ్చు. సాంప్రదాయికంగా ఉపయోగించే సాధారణ ఉపకరణాలు తేలికగా తిరగలేనిచోట (కర్వ్‌డ్ కెనాల్స్‌లో) సైతం లేజర్ కాంతిని ప్రసరింపజేయడం ద్వారా అక్కడి బ్యాక్టీరియాను నిర్మూలించవచ్చు. దాంతో రూట్‌కెనాల్ నూటికి నూరుపాళ్లు సురక్షితంగా చేయడం సాధ్యమవుతుంది.

NO COMMENTS