మీ స్వరపేటికను కాపాడుకోవాలంటే?

కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా వారి గొంతు వినాలనిపిస్తుంది. మృదు మధుర స్వరం అంతే ఇష్టపడని వారుండరేమో. ఒకనాడు సింగర్స్ మాత్రమె తమ స్వరాన్ని కాపాడుకునేవారు. కాని నేడు ఆ పరిస్తితికి భిన్నంగా కాల్ చెంటర్లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ, మార్కెటింగ్ లోనూ నాన్ స్టాప్ మాటలటో అలరించాల్సి వస్తోంది. సరే ఇల అలరించినా అది కొంతకాలమే. కొంత కాలం వెళ్ళాక స్వర పేటికా సమస్యలు మొదలవుతాయి. స్వరపేటికకు వచ్చే వ్యాధులు, చికిత్స, జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

అవతలి వ్యక్తి మాట విన్న తర్వాత శబ్దతరంగాలు చెవి ద్వారా మెదడుకు చేరతాయి. వీటిని మెదడు విశ్లేషిస్తుంది. మనం ఏం చెప్పాలనుకున్న దాన్ని మెదడు సందేశం ద్వారా స్వరపేటికకు పంపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మనం మాట్లాడుతున్నాం. మనం మాట్లాడాలంటే కీలకమైంది స్వరపేటిక (లారింగ్స్‌). స్వరపేటికలో కంపించే (వైబ్రేటింగ్‌) నిర్మాణం ఉంటుంది. వీటిని వొకల్‌కార్డ్స్‌ అంటారు. వొకల్‌కార్డ్స్‌కు సంబంధించిన కండరాలు, వీటిని నియంత్రించే నరాలుంటాయి. ఇదంతా మెదడు నియంత్రణలో ఉంటుంది. మాట్లాడటానికి మెదడు ఆదేశం ఇచ్చే క్రమంలో మనం శ్వాసలోపలికి పీల్చుకుని గాలిని బయటికి వదిలినప్పుడు వొకల్‌కార్డ్స్‌ కంపిస్తాయి (వైబ్రేట్‌). దీని వల్ల బేసిక్‌ వాయిస్‌ ‘ఆ…’ పుడుతుంది. ఈ శబ్దం నోట్లో నుంచి వచ్చినప్పుడు నాలుక, నాలుక చుట్టున్న కండరాలు దీనికి శబ్దరూపాన్నిస్తాయి. శబ్దానికి గాలిగదుల్లాంటి సైనస్‌లు, దాని నిర్మాణం ఒక టోన్‌ని ఇస్తాయి. కొంత మంది పాడితే శ్రావ్యంగా ఉంటుంది. వీరికి పుట్టుకతో ఏర్పడిన సైనస్‌లే కారణం.

గొంతు తొందరగా అలసిపోవడం మొదటి లక్షణం. అంటే ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం. స్వరం తారాస్థాయికి వెళ్లినప్పుడు, బిగ్గరగా మాట్లాడినప్పుడు స్వరం విడిపోతుంది. రెండుగా వినిపిస్తుంది. అప్పుడు స్వరాన్ని నియంత్రించుకోవాలి. మృదురూపంలోకి తెచ్చుకోవాలి.మసాల పదార్థాలు, కారం ఎక్కువున్న పదార్థాలు తినేవారిలో, సమయానికి ఆహారం తీసుకోని వారిలో ఎసిడిటి పెరుగుతుంది. దీని వల్ల ‘లారింగో ఇసోఫేగల్‌ రిఫ్లక్స్‌’ వస్తుంది. కడుపులోని ఆమ్లాలు పైకి వచ్చి స్వరపేటికకు వ్యాపించడం వల్ల కూడా స్వరం మారే అవకాశముంది. ఈ సమస్య తగ్గడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. గొంతుబొంగురపోయినప్పుడు ఇన్‌ఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. ల్యారింగోస్కొప్‌/ఎండొస్కోప్‌/ఫ్లెక్సిబుల్‌ ల్యారింగొస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు. వీటి వల్ల స్వరపేటికలో కలిగే మార్పులను గుర్తిస్తారు. దీనికి ఎలాంటి చికిత్స చేయాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఈ సమస్యలన్నీ మనం తొలిదశలోనే గుర్తించే వీలుంది. అంటే గొంతు మారడాన్ని గొంతుబొంగరు పోవడాన్ని చాలా సులభంగా గుర్తించొచ్చు. నిర్లక్ష్యం చేయకుండా ఇఎన్‌టి వైద్యున్ని సంప్రదించాలి. కొన్ని జబ్బులు ముదరకుండా చికిత్స చేసేవీలుంది. కొన్ని క్యాన్సర్లను తొలిదశలోనే నయం చేసుకోవచ్చు.

స్వరపేటికా సమస్యలు:

సాధారణంగా స్వరపేటికకు సంబంధించి వచ్చే సమస్యలు…వొకల్‌కార్డ్‌ ఎపిథీలియంపై నీటిపొర ఉంటుంది. ఇది ఎండిపోవడం వల్ల స్వరానికి సంబంధించిన సమస్యలు వస్తాయి.

1. వొకల్‌ పాలిప్స్‌ : స్వరపేటికలోని పొరలో నీరు చేరి ఉబ్బుతాయి. దీన్ని పాలిప్స్‌ అంటాం. ఉబ్బిన తర్వాత చిన్న కణతిలాగా మారుతుంది. ఇది క్రమంగా పెరుగుతుంది. దీన్ని మందులతో నయం చేయలేం. మైక్రోలారింగ్‌ సర్జరీ, లేజర్‌ సర్జరీ ద్వారా చికిత్స చేసి తొలగిస్తారు.

2. వొకల్‌ నాడ్యుల్స్‌ : రోజులో ఎక్కువ సమయం మాట్లాడేవారిలో, అకస్మాత్తుగా స్వరాన్ని పెంచేవారి (రాక్‌ సింగర్స్‌ వాయిస్‌)లో ఈ సమస్య వస్తుంది. వొకల్‌కార్డ్‌లో మూడు భాగాలుంటాయి. మొదటి, చివరి భాగాల మధ్య ఉన్న భాగంలోని పొర చిన్న చిన్నగా చిట్లడం మొదలువుతుంది. తొలిదశలో చిట్లి తర్వాత మానుతుంది. కానీ ఇలా చిట్లడం మళ్లీ మళ్లీ జరిగినప్పుడు చిట్లిన చోట కండ తయారవుతుంది. దీంతో తరంగ ధైర్ఘ్యం (వేవ్‌లెంత్‌) మారుతుంది. నెమ్మదిగా కండలోకి రక్తప్రసరణ పెరుగుతుంది. తొలిదశలో దీన్ని మైక్రోస్కోప్‌ ద్వారా గుర్తించి పరీక్షించాలి. వాయిస్‌ స్పీచ్‌ మాడ్యులేషన్‌తో చికిత్స చేయొచ్చు. ఈ దశలో కూడా నియంత్రించకుండా నిర్లక్ష్యం చేస్తే వోకల్‌ నాడ్యుల్స్‌ పరిమాణం పెరిగి శస్త్రచికిత్స వరకు వెళ్లే అవకాశముంది. ఒక నాడ్యుల్‌కు ఒకసారి మాత్రమే ఆపరేషన్‌ చేస్తారు. ఇది మానిన తర్వాతే ఇంకో నాడ్యుల్‌కు ఆపరేషన్‌ చేస్తారు.

3. వొకల్‌కార్డ్‌ ఎడిమ: వొకల్‌కార్డ్‌ కింద ఉన్న పొరపై నీరుచేరి వాపు వస్తుంది. దీంతో స్వరంలో తేడా కనిపిస్తుంది. దీన్ని మైక్రోలారింగ్‌ సర్జరీ, లేజర్‌ సర్జరీ, మైక్రోఫ్లాప్‌ టెక్నిక్‌ సర్జరీతో చికిత్స చేస్తారు.

4.స్వరపేటిక క్యాన్సర్‌ : ధూమపానం, మద్యపానం వల్ల స్వరపేటిక క్యాన్సర్‌ వస్తుంది. తొలిదశలో గొంతుబొంగురుపోతుంది. దీన్ని గుర్తించి క్యాన్సరా? కాదా? అనేది నిర్ధారించాలి. మొదటి దశలోనే దీన్ని గుర్తించి రేడియేషన్‌ ద్వారా చికిత్స చేస్తే 99 నుంచి 100 శాతం వరకు క్యాన్సర్‌ నయమవుతుంది.

5.వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ : స్వరపేటికలో కదలిక ఉండదు. స్తబ్దుగా ఉంటుంది. ఒక్కోసారి రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి గొంతు బొంగురుపోతుంది. ఏమైందని పరీక్షిస్తే స్వరపేటికి పనిచేయడం లేదని అర్థమవుతుంది. ఇన్‌ఫెక్షన్‌ వల్ల కూడా ఇది రావొచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు చికిత్స చేయడానికి ముందు 6 నుంచి 18 నెలలు ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో స్వరపేటిక తనంతట తాను సవరించుకుని, స్వరం మామూలు స్థాయికి చేరుకుంటుంది.

అప్పటికీ ఇంకా సమస్య ఉంటే ‘టైప్‌-1 థైరోప్లాస్టీ’ అనే ఆపరేషన్‌ ద్వారా చికిత్స చేస్తారు. వొకల్‌కార్డ్‌ పెరాలసిస్‌ ఎడమవైపు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఛాతిలో ఏర్పడిన గడ్డ వొకల్‌కార్డ్‌కు వెళ్లే నరాన్ని వత్తుతుంది. అందుకే పెరాలసిస్‌ వచ్చినప్పుడు ఛాతి ఎక్స్‌రే తీసి, గడ్డలున్నాయో పరీక్షిస్తారు. కొన్నిసార్లు మెదడు, మెడ భాగం సిటి స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. గుండె వాచి నరం ఒత్తిడికి గురైనప్పుడు కూడా పెరాలసిస్‌ వచ్చే అవకాశముంది. దీన్ని హార్ట్‌నెస్‌ సిండ్రోం అంటాం. థైరాయిడ్‌ సర్జరీ, గుండె శస్త్రచికిత్స తర్వాత నరానికి గాయమై సమస్య కలగొచ్చు.

NO COMMENTS