చిన్నారుల్లో వచ్చే కళ్ళ సమస్యలు

eye problems faced by kids

మీ చిన్నారి సరిగ్గా చదవలేకపోతున్నారా..బోర్డ్ పైన అక్షరాలను సరిగ్గా గుర్తించలేకపోతున్నారా? అయితే వాళ్ళేదో స్కూలు మానేయటానికి వంక చెబుతునారనుకోవద్దు. కంటి సమస్యలు పెద్ద వయసు వారికే అనుకునుని అపోహ పడవద్దు.. మీ చిన్నారి స్పష్టంగా చదవలేకపోవడానికి కారణం… బోర్డుపైన ఉన్నది అస్పష్టంగా కనిపించడం వెనుక రహస్యమేమిటంటే చిన్నారులకూ కళ్ళ సమస్యలొస్తాయని తెలుసుకోవాలి. అయితే ప్రస్తుతం మీరు తెలుసుకోవాల్సిన విషయం చిన్నారుల కళ్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఓ వైద్యవిభాగం ఉందని… ఆ విభాగం పేరే ‘పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజీ’ అని. పదహారేళ్ల లోపు వయసున్న పిల్లలకు సంబంధించిన కంటిసమస్యలను కనుగొని చికిత్స చేసే వైద్యనిపుణులను ‘పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్’ అని అంటారు. అయితే మీ చిన్నారుల్లోనూ ఆ సమస్యలేమైనా ఉన్నాయేమో గుర్తించాలంటే..మా ఆర్టికల్ చదవండి.. ఆ సమస్యలను ప్రత్యేకంగా మీకందిస్తున్నాం. అవేంటో తెలుసుకుందామా..!

అన్‌కరెక్టెడ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్

ఇందులో లక్షణాలు కంటికి కనిపించేది స్పష్టంగా లేకుండా మసకమసకగా ఉండటం (బ్లర్‌డ్ ్రవిజన్), ఏదైనా చూస్తున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు కంటికి ఇబ్బందిగా ఉండటం, ఎక్కువసేపు చదివినప్పుడు కంటికి భారంగా అనిపించడం, కళ్లలోంచి నీరు కారడం, తలనొప్పి మొదలైనవి. ఈ ఇబ్బందులను యాస్థెనోపిక్ సింప్టమ్స్ అంటారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోనే సరైన అద్దాలను ఉపయోగించడం ద్వారా పిల్లలకు స్పష్టంగా కనిపించేలా చేసి… సమస్య తీవ్రతరం కాకుండా కాపాడవచ్చు.

ఆక్యులార్ అలర్జీ

పిల్లలకు ఏవైనా సరిపడని పక్షంలో (అంటే ఇంట్లో ఉండే దుమ్ము ధూళి లేదా పూల పుప్పొడి వంటి వాటితో) కన్ను బాగా ఎర్రబారడం, కళ్లను తీవ్రంగా నలుపుకోవాలి అనిపించేలా కనురెప్పల చివరల్లో దురదలు, కళ్లలో నీరు రావడం వంటివి.

స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ (మెల్లకన్ను)

ఈ సమస్య ఉన్న పిల్లల్లో రెండు కళ్లలోని నల్లగుడ్డు ఒకేలా లేకపోవడం (అంటే ఒకటి ఒక పక్కకు గాని, లేదా రెండూ రెండు పక్కలకు గాని తిరిగి ఉన్నట్లు కనిపించడం). ఈ లక్షణాన్ని మిస్‌అలైన్‌మెంట్ ఆఫ్ ఐస్ అని పేర్కొనవచ్చు. దీన్ని వాడుక భాషలో మెల్లకన్ను అని వ్యవహరిస్తుంటారు. సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో మెల్లకన్ను అదృష్టసూచిక అని ఒక దురభిప్రాయం ఉంది. అయితే మన రెండు కళ్లలో చివరన ఏర్పడే ప్రతిబింబాలు రెండూ మెదడులో ఒకటిగానే కనిపించే ఏర్పాటు ఉండి… మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్

స్ట్రేబిస్మస్ లేదా స్క్వింట్ అని పిలిచే ఈ మెల్లకన్నుకు సరైన వయసులో సాధ్యమైనంత త్వరగా చికిత్స జరగకపోతే అది ఆంబ్లోపియా అన్న సమస్యకు దారితీసి శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మెల్లకన్ను అదృష్టసూచిక కాదని గ్రహించి, పిల్లల్లో ఈ సమస్య ఉంటే వెంటనే కంటి వైద్యనిపుణులకు అందునా చిన్నపిల్లల కంటివైద్యుల (పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్)కు చూపించడం మంచిది.

రెటినల్ డిస్ట్రఫీస్ అండ్ డీజనరేషన్స్

ఈ తరహా జబ్బుల్లో కంటికి దగ్గర్లో ఉన్నవి లేదా దూరాన ఉన్నవి స్పష్టంగా కనిపించకపోవడం, రాత్రివేళల్లో లేదా పగటి వెలుతురు ఎక్కువగా ఉన్న సమయాల్లో స్పష్టంగా కనిపించకపోవడం, రంగులను స్పష్టంగా గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవేగాక మనకు కనిపించే కంటిచూపు పరిధి (ఫీల్డ్ ఆఫ్ విజన్) తగ్గుతూ పోవడం, ఒక్కోసారి కనుగుడ్లు అటూఇటూ వేగంగా కదులుతున్నట్లుగా ఉండటం (వైద్య పరిభాషలో నిస్టాగ్మస్) వంటి లక్షణాలు ఉన్న సమస్యలన్నీ ఈ విభాగంలోకి వస్తాయి.

ల్యూకోకోరియా

ఇందులో కంటిపాప తెల్లగా కనిపిస్తుంది. మనలో చాలామందికి సాధారణంగా కంటిలోని తెల్లపువ్వు ఒక వయసు తర్వాతే వస్తుంటుందని భావిస్తుంటాం. కానీ కొందరిలో పుట్టుకతోనే కళ్లలో తెల్లపువ్వు (కంజెనిటల్ కాటరాక్ట్) ఉంటుందన్నమాట. అలాంటివే కంటిలో గడ్డలు (వైద్యపరిభాషలో ఇంట్రా ఆక్యులార్ ట్యూమర్స్) కనిపించే రెటినోబ్లాస్టోమా వంటి కేసులు కూడా ఉంటాయి. రెండు కిలోల కన్నా తక్కువ బరువు ఉన్న పిల్లలు లేదా తొమ్మిది నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో రెటీనా దెబ్బతినే పరిస్థితి కూడా రావచ్చు. దాన్నే హాఫ్ ప్రీమెచ్యురిటీ రెటినోపతి అంటారు.

విటమిన్-ఏ లోపంతో వచ్చే కంటిసమస్యలు

కొందరు పిల్లల్లో పోషకాహారలోపం వల్ల కూడా కంటి సమస్యలు రావచ్చు. ఇటువంటివారిలో కళ్లు పొడిబారిపోవడం, రాత్రిపూట కనిపించకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. వీళ్లను పరిశీలిస్తే నల్లగుడ్డు పక్కన తెల్లమచ్చలు (కార్నియల్ అండ్ కంజంక్టివల్ గ్సీరోసిస్) ఉంటాయి. దీనికి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటిలోని నల్లగుడ్డు దెబ్బతిని చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.