మహిళల్లో మూత్ర సంబంధ సమస్యలు

urinary tract infections in women
urinary tract infections in women

మహిళల్లో మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు చాలా తరచుగా వస్తుంటాయి. ఈ సమస్యతో సతమతమయ్యే స్త్రీలు దాదాపు అధిక శాతంలో ఉంటారు. ఈ సమస్య నుంచీ బయటపడేందుకు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు.మహిళల్లో వచ్చే ఈ మూత్ర సంబంధ సమస్యల గురించి మా తెలుగు టిప్స్ పాఠకులకు ప్రత్యేకంగా ఈ శీర్షికను అందిస్తున్నాం. ఆ సమస్యలేంటో చూద్దామా..

1. మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ రావడం, తమ ప్రమేయం లేకుండా మూత్రం కారిపోవడం (యూరినరీ ఇన్‌కాంటినెన్స్) అనే సమస్యలను చాలా ఎక్కువగా చూస్తుంటాం.

2. మూత్రంలో ఇన్ఫెక్షన్ అనే సమస్యతో బాధపడేవారు మూత్రవిసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సిరావడం, చలిజ్వరం వంటి లక్షణాలతో వస్తుంటారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మూత్రంలో రక్తం వచ్చే అవకాశం  ఉంది.

3. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఎన్నో కారణాల వల్ల రావచ్చు. చిన్నపిల్లల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో ఈ సమస్య వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్స్ వాడి ఊరుకోకుండా ఈ సమస్యకు కారణాలేమిటో పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల అవయవాలలో పుట్టుకతోనే వచ్చే మార్పుల (కంజెనిటల్ అనామలీస్) వల్ల మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అసలు కారణం తెలుసుకోకుండా ఎన్నిసార్లు చికిత్స చేసినా ఉపయోగం ఉండదు. అంతేకాక మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

4. యువతుల్లో, కొత్తగా పెళ్లయిన మహిళల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. కొత్తగా పెళ్లయిన వాళ్లలో వచ్చే హనీమూన్ సిస్టైటిస్ వల్ల ఈ సమస్య వస్తుంది. మహిళల్లో మూత్రనాళం చిన్నగా ఉండటం, జననేంద్రియాలకు దగ్గరగా ఉండటం వల్ల పురుషుల కంటే తరచుగా స్త్రీలలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.

5. వయసుమళ్లిన స్త్రీలలో (పోస్ట్ మెనోపాజల్ ఉమన్‌లో) కూడా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వచ్చే సమస్యే. దీనికి కారణం నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే హార్మోన్ల లోపమే. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ లోపం వల్ల మూత్రనాళం సన్నబడే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రాశయంలో మూత్రం నిల్వ ఉండి మాటిమాటికీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ హార్మోన్ల లోపం వల్ల మూత్రాశయంలోని కణాలకు రోగకారక క్రిముల (బ్యాక్టీరియా)ను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతుంది.

6.మూత్రంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా రావచ్చు. మూత్రనాళంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను యురెథ్రైటిస్ అని అంటారు. మూత్రాశయంలోని ఇన్ఫెక్షన్స్‌ను సిస్టయిటిస్ అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ను పైలోనెఫ్రైటిస్ అంటారు. అలాగే మొదటిసారి మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడాన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అనీ, మళ్లీ మళ్లీ రావడాన్ని పర్‌సిస్టెంట్ బ్యాక్టీరియోరియా అనీ లేదా రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. మొదటిసారి వచ్చే ఇన్ఫెక్షన్స్ కోసం ప్రత్యేకమైన పరీక్షలేమీ అవసరం లేదు.

7. కానీ మళ్లీ మళ్లీ వస్తుంటే మాత్రం అది ఏ కారణం వల్ల అన్నది తెలుసుకోవాలి. ఆ తర్వాతే నిర్దిష్టంగా చికిత్స జరగాల్సి ఉంటుంది. పుట్టుకతో వచ్చే లోపాలకూ, మూత్రపిండాల్లో రాళ్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్‌కు అవసరమైతే ఆపరేషన్ చేసి, ఆ లోపాన్ని సరిచేయాల్సి రావచ్చు. ఒక్కోసారి మూత్రావయవాలలో టీబీ వల్ల కూడా మాటిమాటికీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మామూలుగా చేసే కల్చర్ పరీక్షలో బయటపడదు. టీబీ క్రిముల కోసం ప్రత్యేకమైన మూత్రపరీక్షలు చేయాల్సి ఉంటుంది.

Subscribe to Blog via Email

Join 9,535 other subscribers

మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చేవారికి సాధారణంగా చేసే పరీక్షలే కాకుండా మూత్రావయవాలలో ఏమైనా మార్పులు వచ్చేయేమో తెలుసుకోడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొన్ని ప్రత్యేకమైన ఎక్స్-రే (ఐవీయూ, ఎంసీయూజీ లాంటివి) పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.