
ఏ పండగ సమయంలోనైనా, శుభ సందర్బాలలోనైనా ప్రతి ఇంట్లో చేసుకునే రుచికరమైన దక్షిణ భారత దేశపు సంప్రదాయక మరియు ఫేవరెట్ స్వీట్ ‘చక్కెర పొంగల్’. కొందరు ‘స్వీట్ పొంగల్’ లేదా ‘బెల్లం పొంగల్’ అని కూడా అంటారు. ఎన్నో ఆలయాల్లో ఈ స్వీట్ ని దేవుడికి నైవేద్యం చేసి భక్తులకు ప్రసాదంగా పంచుతారు కూడా. మరి ఎంతో తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ స్వీట్ తయారీకి కావలసిన పదార్థాలు మరియు తయారు చేసే విధానాన్ని చూద్దాం.
కావలసిన పదార్థాలు
- బెల్లం తరుగు – 1 కప్పు
- బియ్యం – 1 కప్పు
- పెసర పప్పులు – 1 కప్పు
- ఇలాచీ పొడి – 1 చెంచా
- నెయ్యి
- డ్రై ఫ్రూట్స్ (బాదం పప్పులు, జీడి పప్పులు, ఎండు కొబ్బరి మరియు ఎండు ద్రాక్ష)
తయారు చేసే విధానం
- ముందుగా ఒక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.
- నెయ్యి కాస్త వేడెక్కాక, కట్ చేసి పెట్టుకున్న బాదాం పప్పులు, జీడీ పప్పులు, కిస్మిస్ మరియు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.
- డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక ఒక ప్లేట్ లో తీసి పక్కకు పెట్టుకోవాలి.
- తరువాత అదే ప్యాన్ లో ఒక కప్పు పెసరపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి.
- పెసరపప్పు వేగాక అందులో ఒక కప్పు కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు బియ్యం ఉడకడానికి నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
- తరువాత ప్యాన్ కి మూత పెట్టి ఈ పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు వేరొక ఫ్యాన్ లో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి.
- నీళ్లు వేడయ్యాక అందులో ఒక కప్పు బెల్లం తరుగు వేసి కరిగించుకోవాలి.
- అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి.
- కాసేపటికి బెల్లం బాగా మరుగుతుంది.
- మరుగుతున్న బెల్లంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మరియు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలిపి, ముందుగా రోస్ట్ చేసి పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చెయ్యాలి.
- అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి బెల్లం పొంగలి రెడీ!