Posted on

Want to go to Goa with family in Telugu – గోవా యొక్క వివరాలను తెలుసుకున్నారా?

గోవా భారతదేశంలో పశ్చిమ తీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. ఇది దేశంలో వైశాల్య పరంగా రెండవ అతి చిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతి చిన్న రాష్ట్రం. గోవా రాజధాని ‘పనజీ’. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకున్నారు. కొద్ది కాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నారు. 450 సంవత్సరాల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. వలస పాలకులు చివరి వరకూ మన దేశంలో వదలని ప్రాంతం గోవా. చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపదలతో గోవా మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పడింది.

గోవా అనగానే మొదట ఉత్సాహం చెందేవారు యువకులు. ఎందుకంటే అక్కడి క్యాసినోలు, కార్నివాల్స్‌, పబ్బులు మరియు పార్టీలు వారిని ఆకర్షిస్తాయి. గోవా అనగానే ఇవే ఉంటాయని చాలా మంది అభిప్రాయం కూడా. కానీ, ఈ చిట్టి రాష్ట్రంలో ఇంతకు మించిన విశేషాలున్నాయి. ప్రకృతి రమణీయత, సుందర తీరాలు, నిర్మలమైన సూర్యాస్తమయాలు, సాగర హోరులో సాగే సాహసాలు… ఇలా ఎన్నో! ఇవన్నీ అన్ని వయసుల వారినీ అలరించేవే. కుటుంబ విహారమైనా, స్నేహితులతో సరదా ట్రిప్పయినా అనుకూల పర్యాటక కేంద్రమిది. కనుక ఈసారి గోవాకు కుటుంబంతో వెళ్లండి.

ఆహ్లాద పరిచే కొబ్బరి తోటలు, ఆ తోటల నడుమ అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే రంగు రంగుల ఇళ్లు, చూసినన్ని చారిత్రక వారసత్వ కట్టడాలు,  జాలీ స్పాట్‌లు ఇలా విహార పర్వం విజయవంతం చేసే నెలవులెన్నో గోవాలో ఉన్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో యువత కేరింతలతో ఊగిపోయే గోవా… ఫిబ్రవరి, మార్చి నెలల్లో అందరి విహార కేంద్రమవుతుంది. వినోదాల్లో తేలిపోయే కుటుంబాలు, అలల ఆలింగనంతో చెదిరిపోయే కొత్త జంటల పాదముద్రలతో సుందర తీరం మరింత మనోహరంగా కనిపిస్తుంది. మరి ఈ ప్రదేశం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

గోవా చేరుకోవడం ఎలా?

ముందుగా గోవా కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

 • హైదరాబాద్‌ నుంచి గోవాకు నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. ప్రైవేట్‌ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా విహారం కొనసాగించవచ్చు.
 • గోవా ప్రాంతంలో కులెం, మాడ్‌గావ్‌, వాస్కో డా గామా రైల్వేస్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా స్టేషన్లలో దిగి ట్యాక్సీలో గోవా తీరాలకు చేరుకోవచ్చు.

గోవా లో ఎక్కడ స్టే చేయాలి?

గోవాలో అన్ని వర్గాల వారికీ అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబసభ్యులతో సందర్శించే వారికి రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే అతిథిగృహాలు మొదటి ఎంపిక. ఆన్‌లైన్‌ బుకింగ్‌తో తక్కువలోనే మంచి డీల్స్‌ సొంతం చేసుకోవచ్చు. అద్దె రోజుకు రూ.500 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది.

గోవా లోని ఆకర్షణలు

 1. క్రూయిజ్‌ విహారం : గోవాలో క్రూయిజ్‌ విహారం మరచిపోలేని అనుభూతినిస్తుంది. అరేబియా సముద్రం, మండోవి నదిపై సాగుతూ ప్రకృతి ఒడిలో తేలిపోవచ్చు. క్రూయిజ్‌ డెక్‌ పైన స్థానిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పెద్దలు కూడా పిల్లలు అయిపోతారు.
  ధర: రూ.300 (ఒక్కొక్కరికి)
 2. దక్షిణ తీరాలు : గోవాలో 125 కి.మీ. పొడవునా తీరాలు విస్తరించి ఉన్నాయి. వీటిని ఉత్తర, దక్షిణ తీరాలుగా విభజన చేశారు. పార్టీలు, కార్నివాల్స్‌, సాహస విన్యాసాలకు ఉత్తర తీరాలు కేరాఫ్‌గా నిలిస్తే, ప్రశాంతంగా సేద తీరడానికి దక్షిణ తీరాలు అనువుగా ఉంటాయి. దక్షిణ తీరాల్లో పాలొలెమ్‌ బీచ్‌ ముఖ్యమైంది. ఇక్కడ సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. ఒడ్డున చిన్న చిన్న కుటీరాలు, ఆయుర్వేద కేంద్రాలున్నాయి. ఉదయాన్నే యోగా తరగతులు నిర్వహిస్తుంటారు. మంకీ ద్వీపం, కోటిగావో వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడికి సమీపంలో ఉంటాయి. ఇదే వరుసలోని అగొందా బీచ్‌ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తర తీరాల్లో కాలన్‌గూట్‌ ప్రధానమైనది. ‘బీచ్‌ల మహారాణి’గా పేరున్న ఈ తీరం ప్రపంచంలో అందమైన పది బీచ్‌లలో ఒకటి. దీనికి సమీపంలోని బాగా బీచ్‌ బాగుంటుంది. ఇదే వరుసలో కొండల శ్రేణుల మధ్య ఉండే అంజునా గ్రామంలో ప్రకృతి అందాలు పరవశింపజేస్తాయి.
 3. జల క్రీడలు : గోవా సందర్శనలో జలక్రీడలు ప్రత్యేక అంకం. సినిమాల్లో చూసే ఫీట్లు ఇక్కడ చేసేయొచ్చు. విండ్‌ సర్ఫింగ్‌, డింగై సెయిలింగ్‌, యాంగ్లింగ్‌, వాటర్‌ స్కూటర్‌ వంటి ఆటలు రోజులను క్షణాల్లా కరిగించేస్తాయి.
  • కండోలిం, బాగా, వగేటర్‌ బీచ్‌లలో జెట్‌ స్కీయింగ్‌ – ధర: రూ. 1,200 నుంచి ప్రారంభం.
  • అంజునా, వగేటర్‌ బీచ్‌లలో పారాసెయిలింగ్‌ – ధర: రూ.1,500
  • మండోవి నది, వగేటర్‌ బీచ్‌ లో వాటర్‌ రాఫ్టింగ్‌ – ధర: రూ.1,800
  • వాస్కో సమీపంలోని గ్రాండ్‌ ఐలాండ్‌ లో స్కూబా డైవింగ్‌ – ధర: రూ.2,500- రూ.4,000 మరియు స్నోర్కెలింగ్‌ ధర: రూ.1,000
 4. అగువాడ కోట : అరేబియా అలల తాకిడిని తట్టుకునేలా, 79 ఫిరంగులతో ‘అగువాడ’ కోటని నిర్మించారు. సిన్క్వురియం, కండోలిం బీచ్‌లను విభజించే కోట లోపల 1864లో నిర్మించిన లైట్‌ హౌస్‌ ఆకట్టుకుంటుంది. సూర్యాస్తమయాన ఈ ఎర్రటి కోట యొక్క అందం రెట్టింపవుతుంది. ఉదయాన్నే బీచ్‌లను సందర్శించే యాత్రికులు మధ్యాహ్నం అయ్యేటప్పటికి కోటలో రిలాక్స్ అవుతారు.
 5. బోమ్‌ జీసస్‌ బాసిలికా చర్చి : కేథలిక్‌ల ఆరాధ్య కేంద్రమైన బోమ్‌ జీసస్‌ బాసిలికా చర్చిని 1605లో కట్టారు. బరోక్‌ నిర్మాణ శైలిలో కట్టిన ఈ అద్భుత చర్చిని రోజూ వేల మంది సందర్శిస్తుంటారు. చర్చి ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.
 6. సంత : గ్రామ సంతలు గోవాలో మరో ప్రత్యేకత. ఇక్కడ చవక ధరల్లో షాపింగ్‌ చేయవచ్చు. సాధారణంగా ఈ సంతలు కండోలిం, అంజునా చెంత నిర్వహిస్తారు. శనివారాలు సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల మార్కెట్‌ కూడా ఉంటుంది. అంజునా బీచ్‌లో ప్రతి బుధవారం ఫ్లీ (బేరసారాల) మార్కెట్‌ జరుగుతుంది. తక్కువ ధరల్లో అద్భుతమైన వస్తువులు కొనొచ్చు.

తప్పక చూడాల్సిన మరి కొన్ని ప్రదేశాలు

 • గోవాలో సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం తప్పక చూడాలి.
 • గోవా-కర్ణాటక సరిహద్దులోని మండోవి నదిపై ఉన్న దూద్‌సాగర్‌ జలపాతం అద్భుతమైన ప్రకృతి దృశ్యం. 1,017 అడుగుల ఎత్తు నుంచి నిటారుగా దూకే జలధారలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.
 • గోవాలో ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపి ద్విచక్రవాహనాలు అద్దెకు తీసుకోవచ్చు. అద్దె రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది.
 • గోవాలో రాత్రుళ్లు అద్భుతంగా ఉంటాయి. టిటో స్ట్రీట్‌ క్లబ్బులకు పెట్టింది పేరు. తెల్లవారుజాము వరకూ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. తీరంలోని కాటేజీల్లోనూ పార్టీలు నిర్వహిస్తుంటారు.

సముద్రం బ్యాక్‌వాటర్‌లో భారీ ఓడల్లో ఏర్పాటు చేసిన క్యాసినోలు (జూద శాలలు) ఆకర్షిస్తుంటాయి. కుటుంబాలతో కూడా వీటిల్లోకి వెళ్లొచ్చు. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా కేర్‌ సెంటర్లు ఉంటాయి. భారీ బఫేలు, రకరకాల చిరుతిళ్లు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నిటికీ ధర: ఒకరికి రూ.1,500 నుంచి ప్రారంభం.

Posted on

Want to go abroad in Telugu – వీసా లేకున్నా వెళ్లగలిగే దేశాలెన్నో తెలుసా?

విదేశీ యాత్రకు వెళ్లాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ప్రయాణం అనగానే ముందుగా మనం చేయాల్సిన విషయాలు, మొదట బడ్జెట్ డిసైడ్ చేసుకోవటం, మంచి ప్రదేశాన్ని ఎంచుకోవటం, ఆ తరువాత వీసా కు అప్‌లై చేయటం, వీసా దొరికితే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం. వీటన్నిటిలో ఎంతో కష్టమైన పని వీసా ని పొందటం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో అనేక దేశాలకు ప్రయాణించే ముందుగానే భారతీయులు వీసా పొందవలసి ఉంటుంది. భారతీయులను వీసా లేకుండా తమ దేశంలోకి రానిచ్చేందుకు సుమారు 60 దేశాలు అంగీకరించాయి. వీసా అవసరం లేకుండా కొన్ని దేశాలు, అక్కడకు వెళ్లాక వీసా ఇచ్చేలా మరికొన్ని దేశాలు భారతీయులను తమ దేశంలోకి రానిస్తున్నాయి. కొన్ని దేశాలు పాస్‌పోర్ట్, మరి కొన్ని దేశాలు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలంటున్నాయి. ఇది పర్యాటకంగా ఆయా దేశాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భారతదేశం తో స్నేహం కూడా పెరుగుతోంది.

అక్కడకు వెళ్లాక వీసా ఇచ్చే ప్రక్రియని వీసా ఆన్‌ అరైవల్‌ అని అంటారు. వీసా ఆన్‌ అరైవల్‌ పొందేందుకు పాస్‌పోర్ట్‌ కనీసం ఆరు నెలల గడువు ఉండాలి. తిరుగు ప్రయాణం టికెట్లు, హోటల్‌ బుకింగ్‌ వివరాలు ఇమ్మిగ్రేషన్‌లో అధికారులకు చూపించాలి. మరి వీసా లేకుండా వెళ్లగలిగే 60 దేశాల లిస్ట్ చూద్దాం.

 1. భూటాన్ – వీసా అక్కర్లేదు
 2. డొమినికా – వీసా అక్కర్లేదు
 3. ఎల్ సాల్వడార్ – వీసా అక్కర్లేదు
 4. యుకోడార్ – వీసా అక్కర్లేదు
 5. ఫిజీ – వీసా అక్కర్లేదు
 6. గ్రెనడా – వీసా అక్కర్లేదు
 7. హైతీ – వీసా అక్కర్లేదు
 8. హాంగ్ కాంగ్ – వీసా అక్కర్లేదు
 9. జమైకా – వీసా అక్కర్లేదు
 10. మకావు– వీసా అక్కర్లేదు
 11. మారిషస్ – వీసా అక్కర్లేదు
 12. మైక్రోనేషియా – వీసా అక్కర్లేదు
 13. మోంట్సిరాట్ – వీసా అక్కర్లేదు
 14. నేపాల్ – వీసా అక్కర్లేదు
 15. సెయింట్ కిట్స్ మరియు నెవిస్ – వీసా అక్కర్లేదు
 16. సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడీన్స్ – వీసా అక్కర్లేదు
 17. దక్షిణ కొరియా – వీసా అక్కర్లేదు
 18. శ్రీలంక – వీసా అక్కర్లేదు కాని ప్రత్యేక అనుమతి అవసరం
 19. స్వాల్బార్డ్ – వీసా అక్కర్లేదు
 20. ట్రినిడాడ్ మరియు టొబాగో – వీసా అక్కర్లేదు
 21. టర్క్స్ మరియు కైకోస్ దీవులు – వీసా అక్కర్లేదు
 22. వనాటు – వీసా అక్కర్లేదు
 23. బహ్రెయిన్ – ఇ-విసా
 24. బొలీవియా – వీసా ఆన్‌ అరైవల్‌
 25. కంబోడియా – వీసా ఆన్‌ అరైవల్‌
 26. కేప్ వర్దె – వీసా ఆన్‌ అరైవల్‌
 27. కామోరోస్ -వాసా రావడం
 28. కోట్ డివొయిర్ – ఇ-విసా
 29. జిబౌటి – వీసా ఆన్‌ అరైవల్‌
 30. ఇథియోపియా – వీసా ఆన్ అరైవల్‌
 31. గాబాన్ – ఇ-విసా
 32. జార్జియా – ఇ-విసా
 33. గినియా-బిస్సా – వీసా ఆన్ అరైవల్‌
 34. గయానా – వీసా ఆన్ అరైవల్‌
 35. ఇండోనేషియా – వీసా ఆన్ అరైవల్‌
 36. జోర్డాన్ – వీసా ఆన్ అరైవల్‌
 37. కెన్యా – ఇ-విసా
 38. లావోస్ – వీసా ఆన్ అరైవల్‌
 39. మడగాస్కర్ – వీసా ఆన్ అరైవల్‌
 40. మాల్దీవులు – వీసా ఆన్ అరైవల్‌
 41. మౌరిటానియా – వీసా ఆన్ అరైవల్‌
 42. మోల్డోవా – ఇ-విసా
 43. మయన్మార్ – ఇ-విసా
 44. పలావు – వీసా ఆన్ అరైవల్‌
 45. రువాండా – ఇ-విసా
 46. సెయింట్ లూసియా – వీసా ఆన్ అరైవల్‌
 47. సమోవా – రాక న అనుమతి
 48. సావో టోమ్ మరియు ప్రిన్సిపి – ఇ-విసా
 49. సెనెగల్ – వీసా ఆన్ అరైవల్‌
 50. సీషెల్స్ – వీసా ఆన్ అరైవల్‌
 51. సోమాలియా – వీసా ఆన్ అరైవల్‌
 52. టాంజానియా – వీసా ఆన్ అరైవల్‌
 53. థాయిలాండ్ – వీసా ఆన్ అరైవల్‌
 54. టోగో – అరైవల్‌ తరువాత అనుమతి అవసరం
 55. ఉగాండా – వీసా ఆన్ అరైవల్‌
 56. జాంబియా – ఇ-విసా
 57. జింబాబ్వే – ఇ-విసా
 58. ఈక్వడార్ – వీసా ఆన్ అరైవల్‌
 59. టువాలు – వీసా ఆన్ అరైవల్‌
 60. అంటార్కికా – వీసా అక్కర్లేదు

వీటిలో కొన్ని దేశాల వివరాలను తెలుసుకుందాం

జోర్డాన్

పశ్చిమ ఆసియాలోని ఎడారి దేశం జోర్డాన్‌. ప్రాచీన నాగరికత, ఈజిప్ట్‌, రోమ్‌ రాజ్యాల ఆనవాళ్లు నేటికీ ఇక్కడ కనిపిస్తాయి. ఉన్నతమైన సంస్కృతితో అలరారే దేశంలో ఆధునికతకు కొదవలేదు. సుగంధ ద్రవ్యాలు అమ్మే వీధులు, ఒంటెలు, రాతి కట్టడాలు ఆకర్షణీయంగా ఉంటాయి. జోర్డాన్‌ యొక్క రాజధాని ‘అమన్‌’ ప్రధాన పర్యాటక కేంద్రం. అమన్‌ నుంచి వివిధ పర్యాటక కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు. అక్కడినుంచి మృత సముద్రానికి బస్సుల్లో వెళ్లొచ్చు. ఈ దేశంలో మరో అద్భుతం పెట్రా. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో పురుడు పోసుకున్న ఈ నగరంలోని అపురూప కట్టడాలు నేటికీ అబ్బురపరుస్తాయి. ఇలాంటి విశేషాలు మరెన్నో ఉన్నాయిక్కడ.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు :

 • మృత సముద్రం
 • పెట్రా రాతి కట్టడాలు
 • అంపీ థియేటర్‌
 • షౌమరీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
 • వాడిరం డెజర్ట్‌ క్యాంప్‌
 • అమన్‌ సిటాడెల్‌

వీసా గడువు : 30 రోజులు

అనుకూల సమయం : సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి

కరెన్సీ : జోర్డాన్‌ దీనార్‌, మన రూ.100తో సమానం

ఆహారం : భారతీయ రెస్టారెంట్లు ఉంటాయి. మసాలా పాలు ఎక్కువగా ఉండే జోర్డాన్‌ వంటకాలు కూడా భోజనప్రియులను అలరిస్తాయి.

ప్యాకేజీలు : రూ.75,000 – రూ.1.20 లక్షల వరకు (హైదరాబాద్‌, ముంబయి, అహ్మదాబాద్‌, డిల్లీ, బెంగళూరు తదితర నగరాల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్‌ ఆపరేటర్లు జోర్డాన్‌, జోర్డాన్‌తో పాటు ఇతర దేశాల ప్యాకేజీలు నిర్వహిస్తున్నాయి)

ఫిజీ

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న 322 ద్వీపాల సమూహం ఫిజీ. ఫిజీ యొక్క అధికారిక నామం ‘రిపబ్లిక్ ఆఫ్ ఫిజీ ఐలాండ్స్’. హనీమూన్‌ డెస్టినేషన్‌గా సాహస క్రీడలకు అడ్డాగా పేరొందిన ఫిజీలో పర్యాటకం ఎంతో బాగుంటుంది. ఫిజీలో భారతీయుల జనాభా దాదాపు 38 శాతం. భారతీయులు మాత్రమే కాదు మనం ఆరాధించే సుబ్రహ్మణ్య స్వామి, రాముడు, గంగ, నాగదేవత తదితర దేవుళ్లకు అక్కడ ఆలయాలు కూడా వెలిశాయి. అందమైన సముద్ర తీరాలు, ఆశ్చర్య పరిచే జలక్రీడలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు క్షణం తీరిక లేకుండా చేస్తాయి. సర్ఫింగ్‌, బోటింగ్‌, రాఫ్టింగ్‌ విన్యాసాలకు ఫిజీ దీవులు వేదికగా నిలుస్తున్నాయి.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు :

 • ఫిజీ రాజధాని సువా, నాడి నగరాలు
 • హైక్‌ బౌమా హెరిటేజ్‌ పార్క్‌ (ప్రకృతి ఒడిలో కొలనులు, జలపాతాలు అలరిస్తాయి)
 • లౌటోకా సుగర్‌ సిటీ (చక్కెర కర్మాగారాలకు ప్రత్యేకం)
 • లెవుకా నగరం
 • స్లీపింగ్‌ గెయింట్‌ ఉద్యానవం
 • శివసుబ్రహ్మణ్య స్వామి ఆలయం

వీసా గడువు : 6 నెలలు

అనుకూల సమయం : నవంబరు నుండి ఏప్రిల్‌ వరకు

కరెన్సీ : ఫిజీ డాలర్‌, మన రూ.34 తో సమానం

ఆహారం : భారతీయ రుచులకు ఇబ్బంది లేదు. దేశవిదేశాలకు చెందిన వంటకాలు ఆస్వాదించవచ్చు.

ఇలా చేరుకోవాలి : ముంబయి నుంచి ఫిజీ రాజధాని సువా, నాడీ కి విమానాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి విహారం కొనసాగించవచ్చు.

ప్యాకేజీలు : చాలా పర్యాటక సంస్థలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కలిపి ఫిజీ ప్యాకేజులు ఆఫర్‌ చేస్తున్నాయి. ప్యాకేజీల ధరలు సుమారు 2 లక్షల నుంచి మొదలవుతున్నాయి.

సీషెల్స్‌

తూర్పు ఆఫ్రికాకు దగ్గరగా హిందూ మహాసముద్రం మధ్యలో 115 ద్వీపాల సమూహం సీషెల్స్‌. హనీమూన్‌ డెస్టినేషన్‌గా ఈ ద్వీపదేశానికి మంచి పేరుంది. అందమైన తీరాలు, అత్యద్భుతమైన జలపాతాలు, అడవులు, పర్వతాలతో పర్యావరణ కేంద్రంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. సాహస క్రీడలకు సీషెల్స్‌ పెట్టింది పేరు. స్కూబాడైవింగ్‌, స్నూర్కెలింగ్‌ సముద్ర గర్భంలోని అందాలను కళ్ల ముందు ఉంచుతాయి. పెద్దగా లోతులేని సముద్ర తీరాలు కేరింతలకు వేదికలవుతాయి. సీషెల్స్‌ ప్రధాన దీవుల మధ్య ఫెర్రీలో విహరించవచ్చు.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు :

 • ఆల్డాబ్రా అటోల్‌ (ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ పగడాల దీవి తాబేళ్లకు ఆవాసం)
 • ప్రాస్లిన్‌ బీచ్‌ (ఇక్కడ తీరంలోని ఇసుక ముఖానికి రాసుకునే పౌడర్‌లా మెత్తగా ఉంటుంది)
 • మాహె నగరం
 • సెయింట్‌ అన్నే నేషనల్‌ మెరైన్‌ పార్క్‌, సీషెల్స్‌ నేషనల్‌ పార్క్‌

వీసా గడువు : 30 రోజులు

అనుకూల సమయం : నవంబరు-మే

కరెన్సీ : సీషెల్లోయిస్‌ రుపీ, మన రూ.5.20తో సమానం

ఆహారం : భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. బడ్జెట్‌ హోటల్ల నుంచి ఖరీదైన రెస్టారెంట్ల వరకు రకరకాల రుచులు అందిస్తాయి.

ఇలా చేరుకోవాలి : ముంబయి నుంచి సీషెల్స్‌లోని మాహె విమానాశ్రయానికి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.

ప్యాకేజీలు : ముంబయి నుంచి ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు సీషెల్స్‌ ప్యాకేజీలు నిర్వహిస్తున్నారు. వీటి ధర రూ.75 వేల నుంచి మొదలవుతున్నాయి.

మకావు

‘వెగాస్‌ ఆఫ్‌ చైనా’గా గుర్తింపు పొందిన మకావూ నగరం యొక్క విస్తీర్ణం యాభై చదరపు కిలోమీటర్ల లోపే! దీనిని ‘గ్యాబ్లింగ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌’గా కూడా పిలుస్తుంటారు. శతాబ్దాల నాటి కట్టడాలు, ఆధునిక కాలంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు… ఇలా అడుగడుగునా అద్భుతాలు దర్శనమిస్తాయి. బంగీజంప్‌, సెయిలింగ్‌ వంటి సాహస క్రీడలు అలరిస్తాయి. మకావులో అడుగుపెడితే చాలు క్షణం తీరికుండదిక.

తప్పక చూడాల్సిన ప్రదేశాలు :

 • మకావు టవర్‌
 • మ్యూజియం
 • సెనడో స్వేర్‌
 • గుయా కోట
 • లైట్‌ హౌస్‌
 • సైవాన్‌ సరస్సు
 • 17వ శలాబ్దం నాటి సెయింట్‌ పాల్‌ చర్చి
 • సమీప నగరం తైపా
 • సముద్రదేవత మా ఆలయం

వీసా గడువు : 30 రోజులు

అనుకూల సమయం : డిసెంబరు-మార్చి

కరెన్సీ : మేకనీస్‌ పటాకా, మన రూ.8.82తో సమానం

ఆహారం : భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. చైనీస్‌ రుచులు, పోర్చుగీసు వంటకాలు నోరూరిస్తాయి.

ఇలా చేరుకోవాలి : బ్యాంకాక్‌ నుంచి మకావు నగరానికి నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.

ప్యాకేజీలు : ప్రైవేట్‌ టూర్‌ ఆపరేటర్లు హాంగ్‌కాంగ్‌, షెంజెన్‌తో కలిపి మకావూ ప్యాకేజీలు నిర్వహిస్తున్నాయి. ధర సుమారు రూ. 1 లక్ష వరకూ ఉంటుంది.