Posted on

How to make Madatha kaja sweet in Telugu – మడత కాజా స్వీట్ రెసిపీ

తెలుగు వారి సాంప్రదాయక తీపి వంటకం ‘మడత కాజా’. ఈ స్వీట్ ని ప్రత్యేకంగా దీపావళి లాంటి పండుగ సమయాలలో తయారు చేసుకుంటారు. క్రిస్పీ మరియు జూసీ టేస్ట్ ఈ స్వీట్ యొక్క ప్రత్యేకత. మరి ఎంతో టేస్టీ స్వీట్ ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • మైదా – 1 కప్పు
  • చక్కెర – 1 కప్పు
  • బట్టర్ – 2 టేబుల్ స్పూన్లు
  • యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
  • నూనె – డీప్ ఫ్రై కి తగినంత

తయారీ విధానం

  • ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ కరిగించిన బట్టర్ వేసి గెడ్డలు లేకుండా పొడిగా కలుపుకోవాలి.
  • తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • ఆ పిండిని 5 నిమిషాల పాటు పక్కకు పెట్టి, ఆ తరువాత చిన్న బాల్స్ లా చేసి, చపాతీ రోలర్ తో పల్చగా చపాతీలా తిక్కుకోవాలి.
  • రెండు చపాతీలు తీసుకొని ఒకదాని మీద మరొకటి వేసి మడత కాజాకు కావలసిన వెడల్పుతో చపాతీని రోల్ చేసుకోవాలి.
  • ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాజాలను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
  • స్టవ్ పై ప్యాన్ లో డీప్ ఫ్రై కి కావలసినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తరువాత కాజాలను ఫ్రై చేసుకోవాలి.
  • బాగా ఫ్రై అయిన తరువాత వాటిని తీసి ఒక ప్లేట్ లో పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు, చక్కెర పాగు తయారు చేసేందుకు ఒక ప్యాన్ లో 1 కప్పు నీళ్లు, 1 కప్పు పంచదార వేసి చక్కెర బాగా కరిగే దాకా కలుపుతూ వేడి చేయాలి.
  • అందులో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసి పాకం చిక్కబడేదాకా వేడి చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.
  • ముందుగా తయారు చేసి పెట్టుకున్న కాజాలను ఆ పాకంలో వేసి కాసేపు నాననిస్తే ఎంతో తియ్యని జూసీ మడత కాజాలు రెడీ!
Posted on

Bobbatlu sweet recipe in Telugu – నేతి బొబ్బట్లు / ఓళిగలు రెసిపీ

మన రాష్ట్రాలలో ముఖ్యంగా రాయలసీమలో బొబ్బట్లు ఎంతో ప్రసిద్ధమైన తీపి పదార్థం. ఉగాది వంటి పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఎంతో ఇష్టంగా చేసుకొని నెయ్యి లేదా పాలతో తింటారు. వీటిని ఓళిగలు అని కూడా అంటారు.

ఇటీవలే వచ్చిన వార్తల్లో అనంతపురం జిల్లాలో ఓళిగలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారట. ఓళిగలలో ఎన్నో రకాలు ఉన్నాయి. పిండి ఓళిగలు, కొబ్బరి ఓళిగలు, కోవా ఓళిగలు ఇంకా మరెన్నో. మరి ఎంతో సులువైన పిండి ఓళిగలను ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

  • మైదా – 1 కప్పు
  • శనగ పిండి – 1 కప్పు
  • బెల్లం తురుము – 1 కప్పు
  • బాదాం మరియు జీడి పప్పు పొడి – 1 కప్పు
  • ఉప్పు – 1 స్పూన్
  • యాలుకల పొడి – 1 స్పూన్
  • నూనె / నెయ్యి – 2 స్పూన్లు

తయారీ విధానం

  • ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ నెయ్యి మరియు కొంత నీళ్లు పోసుకొని గెడ్డలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు శనగ పప్పులు వేసి తగినంత నీళ్లు పోసి, మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
  • ఉడికిన శనగ పప్పుని స్ట్రెయినర్ లో వేసి నీళ్లన్నీ పోయాక మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఒక బౌల్ లో ఈ గ్రైండ్ చేసిన శనగ పప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు బాదాం జీడీ పప్పు పొడి, 1 టీ స్పూన్ యాలుకల పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి.
  • ఇప్పుడొక చపాతీ చెక్కపై పాలిథిన్ కవర్ పై నెయ్యి రాసి ముందే సిద్ధం చేసి పెట్టుకున్న మైదా పిండిని కొద్దిగా తీసుకొని కవర్ మధ్యలో ఉంచి పల్చగా వొత్తి, అందులో స్టఫింగ్ పెట్టి, అన్ని వైపులా  పిండి కవర్ చేసి బాల్ లా చేసుకోవాలి.
  • దానికి నెయ్యి రాసి పాలిథిన్ కవర్ మధ్యలో పెట్టి చపాతీ షేప్ వచ్చేలా చేతితో పల్చగా ఒత్తుకోవాలి.
  • ఇప్పుడొక తవా పై నెయ్యి రాసి, సిద్ధం చేసుకున్న బొబ్బట్టుని వేసి రెండు వైపులా నెయ్యితో ఎర్రగా కాల్చుకోవాలి.
  • ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు రెడీ!
Posted on

Children special teddy bear cake recipe in Telugu – టెడ్డీ బియర్ కేక్ రెసిపీ

స్పెషల్ అకేషన్స్ లో ప్రతి ఒక్కరు ఇష్ట పడేది కేక్స్ ని. అందులోనూ పిల్లలకు కేక్స్ ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలాంటి కేక్స్ ని ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం కూడానూ. మరి ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ టెడ్డీ బియర్ కేక్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • బట్టర్ – 2 టేబుల్ స్పూన్
  • కోకో పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • మిల్క్ మెయిడ్ (నెస్టెల్) – 1/4 కప్పు
  • ఫ్రెష్ క్రీం – 1/4 కప్పు
  • వెన్నిలా ఎసెన్స్ – 1 టేబుల్ స్పూన్
  • ట్యూటీ ఫ్రూటీ
  • ఐసింగ్ షుగర్ – 1 టేబుల్ స్పూన్
  • ఐసింగ్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • షుగర్ పౌడర్ – 250 గ్రాములు
  • మైదా – 250 గ్రాములు
  • బట్టర్ మిల్క్ – 1/4 కప్పు
  • గుడ్లు – 2

తయారీ విధానం

  • ముందుగా ఒక బౌల్ లో 2 టీ స్పూన్ బట్టర్, 1/4 కప్పు మిల్క్ మెయిడ్, 1/4 కప్పు ఫ్రెష్ క్రీం వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అందులో 1 టీ స్పూన్ వెన్నిలా ఎస్సెన్స్, 1 టీ స్పూన్ ఐసింగ్ పౌడర్, 1 టీ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ ఐసింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత పై మిశ్రమంలో 1 కప్పు చక్కెర పౌడర్ వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1 కప్పు (250 గ్రాముల) మైదా, 1/4 కప్పు బట్టర్ మిల్క్ కూడా వేసుకొని కలుపుకోవాలి.
  • బాగా కలుపుకున్న తరువాత 2 గుడ్లను వేసి మరోసారి బాగా కలుపుకొని టెడ్డీ బియర్ మౌల్డ్ లోకి వేసుకోవాలి.
  • ట్యూటీ ఫ్రూటీలను పైన చల్లి 30 నిమిషాల పాటు 180 డిగ్రీ సెల్సియస్ ఓవెన్ లో బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పిల్లల ఫేవరెట్ ‘టెడ్డీ బియర్ కేక్’ రెడీ!
Posted on

Carrot halwa or Gajar halwa recipe in Telugu – క్యారట్ హల్వా రెసిపీ

విటమిన్ ఏ అధికంగా ఉండే క్యారట్లు కంటి చూపుకు ఎంతో మంచిది. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. క్యారట్ తో అనేక రకాల వంటలను చేసుకోవచ్చు. అందులోనూ క్యారట్ హల్వా ఎంతో సులభంగా చేసుకోగలిగే రుచికరమైన తీపి పదార్థం. మరి పిల్లలు ఎంతో ఇష్టపడే క్యారట్ హల్వాను ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నెయ్యి – 1/2 కప్పు
  • తురిమిన క్యారట్ – 2 కప్పులు
  • పంచదార – 1 కప్పు
  • పాలు – 1 కప్పు
  • యాలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
  • జీడిపప్పులు
  • కిస్‌మిస్

తయారీ విధానం

  • స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1/2 కప్పు నెయ్యి పోసుకొని, నెయ్యి వేడెక్కిన తరువాత కొన్ని జీడిపప్పులు వేసి దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • అదే విధంగా అందులో కిస్‌మిస్‌లను కూడా దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తరువాత అదే నెయ్యిలో 1 కప్పు తురిమిన క్యారట్ ని వేసి 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి.
  • మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేయాలి.
  • ఆ తరువాత 1 కప్పు పంచదార వేసి పంచదార కరిగే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి.
  • మూత పెట్టి మరో 2 నిమిషాలు కుక్ చేయాలి.
  • ఇప్పుడు అందులో 1 కప్పు (500 మిల్లీ లీటర్ల) పాలు పోసి 5 నిమిషాల పాటు మూత వేసి ఉడికించాలి.
  • పాలన్నీ మరిగిన తరువాత అందులో 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి.
  • ఇంతకు ముందే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న జీడీ పప్పు, కిస్‌మిస్‌లను ఆడ్ చేసుకుంటే ఎంతో తియ్యని, ఆరోగ్యమైన ‘క్యారట్ హల్వా’ రెడీ!
Posted on

Basundi sweet recipe in Telugu – బాసుంది రెసిపీ

గుజరాత్ మరియు మహారాష్ట్రలో ఎంతో ప్రసిద్థమైన స్వీట్ బాసుంది. పాలలో అధిక ప్రోటీన్, కాల్షియం, మరియు ఎన్నో విటమిన్లు ఉన్నందున ఎముకలకు ఎంతో బలాన్ని ఇస్తుంది. పాలతో ఎన్నో రకాల తీపి వంటకాలను చేసుకోవచ్చు. అందులో ఎంతో సులభమైనది రుచికరమైనది బాసుంది.

కావలసిన పదార్థాలు

  • పాలు – 1 లీటర్
  • మిల్క్ పౌడర్ – 1/2 కప్పు
  • చక్కెర – 1/2 కప్పు
  • కుంకుమ పువ్వు
  • ఏలకుల పొడి – 1 టేబుల్ స్పూన్
  • తరిగిన బాదాం
  • తరిగిన కాజు
  • తరిగిన పిస్తా

తయారీ విధానం

  • ముందుగా కొన్ని కుంకుమ పువ్వులను పాలలో వేసి నానబెట్టుకోవాలి.
  • ఒక మందమైన వెడల్పైన ప్యాన్ లో 1 లీటర్ పాలను పోసి బాగా మరిగించాలి.
  • పాలు బాగా మరిగిన తరువాత అందులో తరిగిన కాజు, బాదాం, పిస్తా మరియు ఏలకుల పొడిని వేసి కొద్ది సేపు మరిగించాలి.
  • ఆ తరువాత నానబెట్టిన కుంకుమ పువ్వులను పాలతో పాటు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు 1/2 కప్పు మిల్క్ పౌడర్ ని కూడా వేసుకొని 10 నిమిషాలు ఉడికించాలి.
  • ఆ తరువాత 1/2 కప్పు చక్కెర వేసి 2 నిమిషాలు ఉడికిస్తే ఎంతో తియ్యని బాసుంది స్వీట్ రెడీ!
Posted on

How to make Suji ka halwa in Telugu – సుజి కా హల్వా రెసిపీ

భారత దేశంలో ముఖ్యంగా పండుగ సమయాలలో సాంప్రదాయకంగా దేవునికి నైవేద్యం పెట్టేందుకు తయారు చేసుకునే తీపి పదార్థం ‘సుజి కా హల్వా’. దీనిని గోధుమ రవ (సెమోలినా) తో చేస్తారు కనుక ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం కూడా. మరి ఎంతో సులువైన ఆరోగ్యకరమైన సుజి హల్వా ని ఎలా చేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • నీళ్లు – 500 మిల్లీ లీటర్లు
  • పంచదార – 1 కప్పు
  • నెయ్యి – 1 కప్పు
  • సుజి/సెమోలినా – 2 కప్పులు
  • తరిగిన బాదాం
  • ఎండు ద్రాక్షలు/ కిస్‌మిస్
  • తరిగిన జీడిపప్పులు

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక ప్యాన్ లో 500 మిల్లీ లీటర్ల నీళ్లు, 250 గ్రాములు లేదా 1 కప్పు పంచదార వేసుకొని చక్కెర కరిగే వరకు ఉడికించాలి.
  • ఈ చక్కెర పాగు చల్లారిన తరువాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ లో 1 కప్పు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తరువాత అందులో 2 కప్పుల సుజి ని వేసి దోరగా వేయించుకోవాలి.
  • సుజి గోల్డెన్‌ బ్రౌన్ రంగుకు వచ్చిన తరువాత అందులో తరిగిన బాదాం, కొన్ని కిస్‌మిస్, కొన్ని జీడిపప్పులు వేసి కలుపుతూ 2 నిమిషాలు దోరగా వేయించాలి.
  • ఇప్పుడు అందులో సిద్ధం చేసి ఉంచుకున్న చక్కెర పాగుని చేర్చుకొని 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
  • దీన్ని బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్‌స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరమైన ‘సుజి కా హల్వా’ రెడీ!
Posted on

Bengali sweet sandesh recipe in Telugu – సందేష్ బెంగాలీ స్వీట్ రెసిపీ

ఎంతో ప్రసిద్ధమైన సులభమైన బెంగాలీ స్వీట్స్ లో ‘సందేష్ బెంగాలీ స్వీట్’ కూడా ఒకటి. ఇది ఎంతో ప్రాచీనమైన తీపి పదార్థం. మధ్యయుగ బెంగాలీ సాహిత్యాలలో ముఖ్యంగా ‘క్రితిబాస్ రామాయణం’లో సందేష్ అనే తీపి వంటకం ప్రస్తావించబడిందని చెప్తున్నారు. మరి ఎంతో ప్రాచీనమైన రుచికరమైన ఈ స్వీట్ ని ఎలా చేయాలో చూద్దాం.

 

కావలసిన పదార్థాలు

  • పాలు – 1 లీటర్
  • నిమ్మరసం
  • కుంకుమ పువ్వు
  • షుగర్ పౌడర్ – 1 కప్పు
  • ఇలాచీ పౌడర్
  • పిస్తా

తయారీ విధానం

  • ఒక ప్యాన్ లో 1 లీటర్ పాలను పోసి మరిగించాలి.
  • పాలను గెట్టిగా చేసేందుకు నిమ్మకాయని పిండి కొంత నిమ్మరసాన్ని పాలలో చేర్చండి.
  • పాలు విరిగిన తరువాత ఒక శుభ్రమైన క్లాత్ తో నీటిని వడగట్టండి.
  • పాలలోని నిమ్మరసం యొక్క రుచి పోయేందుకు నీటితో బాగా కడిగి వడగట్టుకోవాలి.
  • ఆ తరువాత ఒక ప్లేట్ లో వేసుకొని పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలిపి కుంకుమ పువ్వు, 1 కప్పు షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్యాన్ లో వేసుకొని 5 నిమిషాల పాటు దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులో ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి చిన్న చిన్న రౌండ్స్ చేసి వాటిపై పిస్తా తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తియ్యని సందేష్ బెంగాలీ స్వీట్ రెడీ!
Posted on

Rasmalai sweet recipe in Telugu – రసమలై రెసిపీ

ఏ పండుగ సమయంలోనైనా ఏ ప్రత్యేక సందర్బాలలోనైనా ప్రతి ఒక్కరూ ఇష్ట పడేది తీపి పదార్థాలనే. అందులోనూ పాలతో తయారు చేసే స్వీట్స్ ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఎంతో ప్రసిద్ధి చెంది ప్రస్తుతం దక్షిణ భారత దేశంలో కూడా ప్రతి చోటా అందుబాటులో ఉండే స్వీట్ రసమలై. మరి ఈ స్వీట్ ని ఎంతో సులభంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • పాలు – 2 లీటర్లు
  • పంచదారా – 1 బౌల్
  • నిమ్మరసం
  • బాదాం
  • పిస్తా
  • ఏలక్కల పొడి – 1 టేబుల్ స్పూన్
  • జీడీ పప్పులు/ కాజు
  • నీళ్లు

తయారీ విధానం

  • స్టవ్ పై ప్యాన్ ని ఉంచి 1 లీటర్ పాలను పోసి, అందులో 1/2 కప్పు నిమ్మరసం వేసి బాగా వేడి చేస్తే పాలు విరిగిపోతుంది.
  • పాలు పూర్తిగా విగిరిన తరువాత నీటిని ఫిల్టర్ చేసేందుకు ఒక శుభ్రమైన క్లాత్ తో వడగట్టాలి.
  • విరిగిన పాలలో నిమ్మరసం యొక్క రుచి పోయేందుకు నీటితో బాగా కడిగి వడగట్టుకోవాలి.
  • ఆ తరువాత ఒక ప్లేట్ లో వేసుకొని పిండి ముద్దలా అయ్యే వరకు బాగా కలుపుకొని చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి అందులో 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కెర కరిగే వరకు ఉడికించాలి.
  • చక్కెర కరిగిన తరువాత సిద్ధంగా ఉంచుకున్న పన్నీర్ రౌండ్స్ ని వేసి 5 నిమిషాల పాటు మూత వేసి ఉడికించాలి.
  • మరో ప్యాన్ లో 1 లీటర్ పాలు పోసుకొని సన్నటి మంటలో పాలను 30 నిమిషాల పాటు మరిగించాలి.
  • ఆ తరువాత పాలలో 1/2 కప్పు పంచదార, తరిగిన బాదాం, తరిగిన పిస్తా, తరిగిన కాజులు, 1 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ముందే ఉడికించి సిద్ధంగా ఉంచుకున్న పన్నీర్ ముక్కలను పాలలో వేసుకుంటే ఎంతో తియ్యని రుచికరమైన రసమలై రెడీ!
Posted on

Jaggery Pongal /Sweet Pongal, Chakkara Pongal recipe in Telugu – బెల్లం పొంగలి / చక్కెర పొంగలి రెసిపీ

ఏ పండగ సమయంలోనైనా, శుభ సందర్బాలలోనైనా ప్రతి ఇంట్లో చేసుకునే రుచికరమైన దక్షిణ భారత దేశపు సంప్రదాయక మరియు ఫేవరెట్ స్వీట్ ‘చక్కెర పొంగల్’. కొందరు ‘స్వీట్ పొంగల్’ లేదా ‘బెల్లం పొంగల్’ అని కూడా అంటారు. ఎన్నో ఆలయాల్లో ఈ స్వీట్ ని దేవుడికి నైవేద్యం చేసి భక్తులకు ప్రసాదంగా పంచుతారు కూడా. మరి ఎంతో తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ స్వీట్ తయారీకి కావలసిన పదార్థాలు మరియు తయారు చేసే విధానాన్ని చూద్దాం.

కావలసిన పదార్థాలు

  • బెల్లం తరుగు – 1 కప్పు
  • బియ్యం – 1 కప్పు
  • పెసర పప్పులు – 1 కప్పు
  • ఇలాచీ పొడి – 1 చెంచా
  • నెయ్యి
  • డ్రై ఫ్రూట్‌స్ (బాదం పప్పులు, జీడి పప్పులు, ఎండు కొబ్బరి మరియు ఎండు ద్రాక్ష)

తయారు చేసే విధానం

  • ముందుగా ఒక ప్యాన్ ని స్టవ్ పై ఉంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.
  • నెయ్యి కాస్త వేడెక్కాక, కట్ చేసి పెట్టుకున్న బాదాం పప్పులు, జీడీ పప్పులు, కిస్మిస్ మరియు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి.
  • డ్రై ఫ్రూట్‌స్ బాగా వేగాక ఒక ప్లేట్ లో తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • తరువాత అదే ప్యాన్ లో ఒక కప్పు పెసరపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి.
  • పెసరపప్పు వేగాక అందులో ఒక కప్పు కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు బియ్యం ఉడకడానికి నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి.
  • తరువాత ప్యాన్ కి మూత పెట్టి ఈ పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు వేరొక ఫ్యాన్ లో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి.
  • నీళ్లు వేడయ్యాక అందులో ఒక కప్పు బెల్లం తరుగు వేసి కరిగించుకోవాలి.
  • అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • కాసేపటికి బెల్లం బాగా మరుగుతుంది.
  • మరుగుతున్న బెల్లంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మరియు ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలిపి, ముందుగా రోస్ట్ చేసి పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్‌స్ తో గార్నిష్ చెయ్యాలి.
  • అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి బెల్లం పొంగలి రెడీ!
Posted on

Simple butter sponge cake recipe in Telugu – బట్టర్ స్పాంజ్ కేక్ రెసిపీ

ఏదైనా ఒక పుట్టిన రోజు, జాబ్ ప్రమోషన్ లాంటి శుభ సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే ముఖ్య అంశం కేక్ కటింగ్. సాఫ్ట్ మరియు టేస్టీగా ఉండే కేక్ ని వద్దనే వాళ్ళే ఉండరు. ఇక అందులో వెన్నిలా ఫ్లేవర్ తోడైతే సరేసరి. మరి చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన వెన్నిలా ఫ్లేవర్ బట్టర్ స్పాంజ్ కేక్ తయారీ విధానాన్ని తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • గుడ్లు – 4
  • బట్టర్ – 1 కప్పు
  • పాలు – 1 కప్పు
  • చక్కెర – 1/2 కప్పు
  • వెనీలా ఎసెన్స్ – 1 టేబుల్ స్పూన్
  • కేక్ ఫ్లోర్ – 1 కప్పు
  • బేకింగ్ సోడా –  1 టేబుల్ స్పూన్
  • బేకింగ్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి – 1 టేబుల్ స్పూన్

తయారు చేసే విధానం

  • ముందుగా గుడ్లను పగలగొట్టి ఎగ్ వైట్ ని పచ్చసొనని సెపరేట్ చేసుకోవాలి.
  • ఒక బౌల్ లో 1 కప్పు బట్టర్ వేసి బాగా స్మాష్ చేసి 1 కప్పు పాలు పోసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తరువాత 1/4 కప్పు చక్కెర వేసి బాగా కలపాలి.
  • విడిగా ఉంచుకున్న గుడ్డు పచ్చసొనని వేసి బాగా కలుపుకోవాలి.
  • తరువాత 1 కప్పు కేక్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.
  • 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ మరియు 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకుంటే కేక్ బాటర్ తయారు.
  • విడిగా ఉంచుకున్న ఎగ్ వైట్ ని సెపెరేట్ బౌల్ లో వేసుకొని బాగా విస్క్ చేసి నొర వచ్చేలా కలపాలి.
  • అందులో 1/4 కప్పు చక్కెర వేసి మల్లీ బాగా మిక్స్ చేయాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేక్ బాటర్ లో వేసి బాగా కలుపుకోవాలి.
  • కేక్ ని బేక్ చేయడానికి బేకింగ్ ట్రే తీసుకొని, 1 టీ స్పూన్ నెయ్యిని రాసి కేక్ బాటర్ ని ట్రే లో స్ప్రెడ్ చేయాలి.
  • ఓవెన్ లో 180 డిగ్రీ సెల్సియస్ వేడిలో 30 నిమిషాలపాటు బేక్ చేస్తే ఎంతో సాఫ్ట్ మరియు టేస్టీ బట్టర్ స్పాంజ్ కేక్ తయారు!