Hair growth tips in Telugu – Hair loss control tips

0
10800

ప్రతి ఒక్కరి లోనూ తలపై వెంట్రుకలు ఒక అందమైన భాగం. ఎన్నో సందర్భాలలో మన అలంకరణకు తగిన విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవటం వలన మన ముఖంలో అదనపు గ్లో కనిపిస్తుంది. గతంలో ఆడువారు మాత్రమే హెయిర్ స్టైల్ చేసుకునే వాళ్ళు.

కానీ కాలం మారే కొద్ది పురుషులు కూడా ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో మనకు తెలియకుండానే అనేక కెమికల్స్ మరియు అజాగ్రత్తల వలన అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అందులో ఒకటి ఈ హెయిర్ ఫాల్ సమస్య.

ఈ సమస్య యొక్క ప్రధాన కారణాలు మరియు నివారణ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చూద్దాం.

హెయిర్ గ్రోత్ యొక్క దశల

వెంట్రుకలు ఒక క్రమ పద్ధతిలో ఎదుగుతూ, ఆగుతూ, రాలిపోతూ ఉంటాయి. ఇది మూడు దశలుగా సాగుతుంది.

 • ఎదిగే (అనాజెన్) దశ : ఇది 3-6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో వెంట్రుకల కుదుళ్లలోని కణాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి.
 • స్తబ్ధ (కెటాజెన్) దశ : సుమారు 2-3 వారాల పాటు సాగే ఈ దశలో వెంట్రుకలు పెరగటం ఆగిపోతుంది.
 • విశ్రాంతి (టిలోజెన్) దశ : ఇది దాదాపు 100 రోజుల వరకు కొనసాగుతుంది. వెంట్రుకలు రాలిపోయేది ఈ దశలోనే. సుమారు 6 నుండి 8% జుట్టు ఈ దశలో ఊడుతుంది.

ఇదంతా ఒక చక్రంలా అత్యంత సహజంగా, నిరంతరంగా సాగిపోయే ప్రక్రియ. మగవారికి సుమారు లక్ష, ఆడవారికి లక్షన్నర వెంట్రుకలు ఉంటాయి. వాటిలో రోజుకు 50-100 వరకు వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఒకవైపు రాలేవి రాలుతున్నా పెరిగేవి పెరుగుతుండటం వల్ల పెద్ద తేడా కనిపించదు. కొందరికి రోజూ కాకుండా వారానికి సరిపడా ఒకరోజే ఊడిపోవచ్చు.

దీంతో ఏదో అయిపోయిందని, బట్టతల వచ్చేస్తోందని భయపడిపోతుంటారు. అలాంటి భయాలేవీ అవసరం లేదు. విశ్రాంతి దశ తర్వాత ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. వెంట్రుకల ఎదుగుదల, విశ్రాంతి దశలు అస్తవ్యస్తమైతే మాత్రం జుట్టు ఎక్కువగా రాలిపోవటం మొదలెడుతుంది.

హెయిర్ ఫాల్ కారణాలు

మెడికల్ పరంగా హెయిర్ ఫాల్ సమస్యకు సోరియాసిస్, రింగ్ వార్మ్, క్యాన్సర్ చికిత్స, థైరాయిడ్, అలోపీసీయా వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఇటువంటి ఆరోగ్యపరమైన సమస్యల వలన కలిగే హెయిర్ ఫాల్ ని గుణపరిచేందుకు వైద్యుల సహాయం పొందుట మంచిది. మెడికల్ పరంగానే కాకుండా మన నిర్లక్ష్యం వలన కలిగే హెయిర్ ఫాల్ సమస్యలకు కారణాలు మరియు వాటి నివారణ పద్ధతుల గురించి కూడా చూద్దాం.

 • పోషకాల లోపం : మీ హెయిర్ ఫాల్ కి ప్రధాన కారణం సరైన పోషక ఆహారాలను తీసుకోక పోవటం. మనదేశంలో పోషకాల లోపం ముఖ్యంగా ఐరన్ లోపం ఎక్కువ. బి విటమిన్లు, విటమిన్ డి లోపాలు సైతం తరచూ కనిపిస్తుంటాయి. ఇందు కారణంగా కూడా వెంట్రుకలు పలుచబడొచ్చు. బరువు తగ్గటానికి ఆహార నియమాలు పాటించేవారిలో, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నవారిలోనూ పోషకాల లోపం వలన క్రమంగా జుట్టు ఊడిపోవచ్చు (క్రానిక్ టిలోజెన్ ఎఫ్లూవియమ్).
 • బిగువైన హెయిర్ స్టైల్స్గట్టిగా జడ బిగించటం (ట్రాక్షన్ అలోపీషియా): కొందరు జడను ఎంతో గట్టిగా బిగించి వేస్తుంటారు. అందువలన కూడా జుట్టు ఊడిపోవచ్చు.
 • స్ప్లిట్‌ ఎండ్స్ వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య రావచ్చు.
 • డాండ్రఫ్ : డాండ్రఫ్ వలన తలపై నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని వలన దురద తలెత్తుతుంది. అంతేకాదు ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందొచ్చు. ఫలితంగా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
 • వేడి నీటితో తల స్నానం కూడా కుదుళ్లు బలహీనం కావడానికి ఒక కారణం.
 • తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావం.
 • ఒత్తిడి: మానసిక ఒత్తిడి అధికంగా ఉన్న వారి యొక్క జుట్టు పలుచగా అవుతుంటుంది (డిఫ్యూజ్ హెయిర్లాస్). ఒకేచోట కాకుండా తలంతా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. జ్వరం, కాన్పు, సర్జరీల వంటివి శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే కొందరికి జ్వరం తగ్గాక, మహిళల్లో కాన్పు అయ్యాక రెండు మూడు నెలల తర్వాత జుట్టు ఊడిపోతుంటుంది (అక్యూట్ టిలోజెన్ ఎఫ్లూవియమ్). ఈ కారణాల వలన రాలిన జుట్టు కొన్ని రోజుల తరువాత తిరిగి పెరిగే అవకాశం ఉంది. ఇందుకు ప్రత్యేకించి చికిత్స అవసరం లేదు.
 • మద్యపానం సేవించటం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన కూడా జుట్టు అధికంగా రాలిపోయే అవకాశాలు ఉన్నాయి.
 • ఎక్కువగా ఎండలో తిరగటం వలన జుట్టు డ్రై గా మారి రాలిపోవచ్చును.
 • వైద్య పరిస్థితులుమందులు : కొన్ని రకాల మందుల కారణంగా కూడా జుట్టు రాలిపోవచ్చు. క్యాన్సర్తో మామూలుగానే జుట్టు ఊడిపోతుంటుంది. కీమోథెరపీ మందులతోనూ వెంట్రుకలు ఊడిపోవచ్చు. కొన్నిరకాల మానసిక సమస్యల వలన కలిగే నొప్పి మరియు అధిక రక్తపోటు తగ్గటానికి రోగనిరోధక శక్తిని అణచి పెట్టటానికి వేసుకునే మందుల కారణంగా కూడా జుట్టు రాలిపోవచ్చు.
 • వాతావరణ కాలుష్యం – ప్రస్తుత కాలంలో అధిక శాతం హెయిర్ ఫాల్ కు కారణం కాలుష్యం.
 • హెయిర్ స్టైల్ చేసుకునే సమయంలో ఉపయోగించే కెమికల్స్సౌందర్య సాధనాలు: కొందరు వెంట్రుకలను స్ట్రైటనింగ్ చేయటానికి వేడిని పుట్టించే పరికరాలతో ఐరన్ చేస్తుంటారు. దీంతో జుట్టు ఊడిపోయే ప్రమాదం ఉంది. కర్ల్స్ వంటివి చేయటం వలన కూడా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
 • హార్మోన్ల మార్పులు : థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువైనా, తక్కువైనా వెంట్రుకలు పెరిగే ప్రక్రియ దెబ్బతిని, రాలిపోవచ్చు. ఆడవారిలో పీసీఓడీ సమస్య మూలంగా టెస్టోస్టీరాన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఒకవైపు తల మీద జుట్టు రాలిపోయేలా చేస్తే మరోవైపు శరీరంలోని మిగతా భాగాల్లో వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది. పీసీఓడీకి చికిత్స తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఇటీవల జిమ్‌కు వెళ్లేవారు ప్రోటీన్ వంటివి వాడుకోవటం ఎక్కువైంది. దీంతో టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇందు కారణంగా కూడా హెయిర్ ఫాల్ కలగవచ్చు.
 • ఫంగస్ ఇన్‌ఫెక్షన్ : చిన్న పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఇదే. పిల్లలు తరగతిలో దగ్గర దగ్గరగా కూర్చుంటారు. ఒకరినొకరు తాకుతుంటారు. ఇతరుల దువ్వెనలనూ వాడే అవకాశం వుంది. వారిలో ఎవరికైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీంతో జుట్టు ఊడిపోవచ్చు (టీనియా క్యాపిటస్). యాంటీ ఫంగల్ మందులతో ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమైపోతుంది. జుట్టు తిరిగి వస్తుంది.
 • పేను కొరుకుడు (అలోపీషియా ఏరియేటా):  ఇందులో అక్కడక్కడా గుండ్రంగా జుట్టు ఊడిపోయి, నున్నగా అవుతుంది. పేలు కొరకటం వల్ల ఇది వస్తుందని భావిస్తుంటారు. కానీ నిజానికి పేలు వెంట్రుకలను కొరకవు. దీనికి మూలం రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. దీంతో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని, రాలిపోతాయి. థైరాయిడ్ సమస్యలు, ఎండు గజ్జి, మధుమేహం, మానసిక ఒత్తిడి గలవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కొందరికి దీని మూలంగా పెద్ద మొత్తంలోనూ జుట్టు ఊడిపోవచ్చు (అలోపీషియా టోటాలిస్). ఇటువంటి వారిలో కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి. పేను కొరుకుడుతో రాలిపోయిన వెంట్రుకలు మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి మొలుస్తాయి.
 • జుట్టు లాగటం (ట్రైకో టిల్లోమేనియా): కొందరు పిల్లలు వెంట్రుకలను గట్టిగా పట్టుకొని లాగేస్తుంటారు. అలా చేయటం హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. దీనికి మూలం మానసిక సమస్యలు. అలా చేయటం వలన వెంట్రుకలు మధ్యలో తెగిపోతాయి. కొన్ని పొడుగ్గా, కొన్ని చిన్నగా కనిపిస్తాయి. అక్కడక్కడా వెంట్రుకలు ఊడి పోతాయి.
 • చర్మ సమస్యలు: చర్మం మీద మచ్చ (స్కార్) పడేలా చేసే చర్మ సమస్యల వలన కూడా జుట్టు ఊడిపోతుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డిస్కాయిడ్ ల్యూపస్ ఎరీథెమటోసస్, లైకెన్ ప్లేనస్ పైలారిస్ మరియు సార్కాయిడోసిస్ జుట్టుకు వచ్చే దీర్ఘకాల ఇన్ఫెక్షన్లు. వీటి కారణంగా కుదుళ్లు మొత్తంగా ఊడిపోతాయి. అందువల్ల వెంట్రుకలు తిరిగి రావటమనేది జరగదు.

హెయిర్ ఫాల్ తగ్గించేందుకు గృహ నివారణ పద్ధతులు

హెయిర్ ఫాల్ సమస్యకు ఎన్నో వైద్య చికిత్సలు ఉన్నప్పటికీ, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను తొలగించేందుకు ఉత్తమ మార్గం ఇంటి నివారణ పద్దతులను అనుసరించటం. కొన్ని సులభమైన మరియు ప్రభావితమైన హోమ్ రెమెడీలను చూద్దాం.

ఆమ్ల

ఆమ్లా తో అనేక రకాలైన ప్యాక్‌లను తయారు చేసి మీ కురులపై ఉపయోగించవచ్చు.

 • కొబ్బరి నూనెలో లేదా బాదాం నూనెలో కొన్ని ఆమ్లా ముక్కలను వేసి వేడి చేయండి. రెండు మూడు నిమిషాల తరువాత వెచ్చని నూనెని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒకటి లేదా రెండు గంటలు ఉంచి తల స్నానం చేయండి.
 • ఆమ్లా జ్యూస్ మరియు నిమ్మరసంను కలిపి షాంపూలాగా ఉపయోగించవచ్చు.
 • రెండు టేబుల్ స్పూన్ యూకలిప్టస్ నూనెలో ఆమ్లా ముక్కలను రాత్రంతా నానబెట్టండి. ఒక మందపాటి పేస్ట్ సిద్ధం చేయడానికి గుడ్డు మరియు పెరుగును ఈ మిశ్రమంలో కలుపుకోండి. ఈ పేస్ట్‌ని మీ స్కాల్ప్ మరియు జుట్టుపై పూర్తిగా అప్‌లై చేసి ఆరిపోయే వరకు వదిలివేయండి. ఆ తరువాత తేలిక పాటు షాంపూతో కడగాలి.

ఆవాల నూనె

ఆవాల నూనె మరియు హెన్నా ఆకులను కలిపి ఉడికించిన మిశ్రమం హెయిర్ ఫాల్ ని ఆపడానికి ఉపయోగపడుతుంది. 125 మి.లి ఆవాల నూనె మరియు 30 గ్రాముల గోరింటాకులను కలిపి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత నూనెని వడకట్టి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోండి.

ఈ నూనెతో రెగ్యులర్గా మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, అంతే కాదు మీ కురులు పెరుగుదలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.

కలబంద

కలబంద హెయిర్ ఫాల్ ని తగ్గించి డాండ్రఫ్ ని తొలగిస్తుంది. మీ స్కాల్ప్ లో PH లెవెల్స్ ని కూడా రీస్టోర్ చేస్తుంది. కలబంద జెల్ ని డైరెక్ట్ గా మీ స్కాల్ప్ మరియు జుట్టుపై రాసి ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి. ఇలా వారానికి 3 లేదా 4 సార్లు ఉపయోగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

కొబ్బరి పాలు

హెయిర్ ఫాల్ ని ఆపడానికి తలపై కొబ్బరి పాలను రాయడం ఒక ఉత్తమమైన హోమ్ రెమిడీ.

 • కొబ్బరి ముక్కలను బాగా రుబ్బి వాటి నుండి పాలను తీయండి. మీ స్కాల్ప్ మీద మరియు వెంట్రుకల మూలకాల పై అప్లై చేసి ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేయండి. ఇది కేశాలకు పోషణ అందించి ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
 • నిమ్మరసంతో కలిపిన కొబ్బరి నూనెని స్కాల్ప్ మరియు కురులపై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి కురులు పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది.

కొత్తిమీర ఆకులు

కొత్తిమీర ఆకులను రుబ్బి వీటి రసాన్ని రెగ్యులర్గా స్కాల్ప్ పై రాయటం వలన హెయిర్ ఫాల్ తగ్గి మీ కేశాలు ఒత్తుగా పెరుగుతాయి. వారానికి మూడు సార్లు ఈ రసాన్ని ఉపయోగించవచ్చు.

ఆయిల్ మసాజ్

ఆరోగ్యకరమైన, బలమైన జుట్టుని పొందటానికి ఇది అత్యంత ప్రసిద్ధమైన గృహ నివారణలలో ఒకటి. సాధారణ కొబ్బరి నూనె, బాదం నూనె, ఆవాలు నూనె, లావెండర్ నూనె, రోజ్మేరీ వంటి అనేక చమురులు ఉన్నాయి.

ప్రతి నూనె కి దాని స్వంత ప్రయోజనం ఉంటుంది. మీ జుట్టుని ప్రతి రోజూ వీటిలో ఏదో ఒక నూనెతో మసాజ్ చేయండి. ఇది మీ కురులకు సంబంధించిన అనేక సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుంది.

జీలకర్ర విత్తనాలు

జీలకర్ర పేస్ట్ తయారు చేయడానికి కొన్ని గింజలను రుబ్బి అందులో కొబ్బరి నూనెని కలపి ఒక పేస్ట్ ను తయారు చేసుకోండి. దానితో చక్కగా మీ స్కాల్ప్ పై మసాజ్ చేసుకోండి. సుమారు 15 నిమిషాల తరువాత, షాంపూతో తలస్నానం చేయండి.

ఎగ్ వైట్

గుడ్డు ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలం. ఇది మీ జుట్టు యొక్క కోల్పోయిన షైన్ ని తిరిగి తెస్తుంది. పొడవాటి, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీ కురులపై గుడ్డు యొక్క తెల్ల సొనను పూసి కొద్ది సేపు తరువాత తల స్నానం చేయండి. వారానికి ఒకసారి ఈ ప్రక్రియను అనుసరించండి.

వేపాకు

మీ జుట్టుకు కావలసిన అన్ని పోషకాలు వేపాకులో ఉంటాయి. దీని లోని యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక లక్షణాలు మీ జుట్టులో స్ప్లిట్‌స్ ఏర్పడకుండా చేస్తుంది మరియు మీ స్కాల్ప్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని తాజా వేప ఆకులను నీటిలో వేసి బాగా ఉడికించండి.

నీరు సగానికి సగం ఇంకిపోయే వరకు ఉడికించండి. ఈ నీటిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకొని మంచి ఫలితాల కోసం ప్రతి రోజూ మీ స్కాల్ప్ పై దరఖాస్తు చేయండి.

హెన్నా

హెన్నా యొక్క లక్షణాల గురించి అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్, స్ప్లిట్‌ ఎండ్స్, డ్రైనెస్ వంటి అనేక హెయిర్ ప్రాబ్లమ్స్ ని తొలగించటంలో సహాయపడుతుంది. హెన్నా పేస్ట్ ని ప్రతి వారం వాడవచ్చు.

మీరు తాజా హెన్నా పేస్ట్ తో 2 టేబుల్ స్పూన్లు ఆమ్ల రసంను మరియు కొద్దిగా నీరు జోడించి అద్భుతమైన హెయిర్ ప్యాక్‌ని తయారుచేయవచ్చు.

ఒక బ్రష్‌ను ఉపయోగించి మీ జుట్టు మరియు స్కాల్ప్ పై ఈ పేస్ట్ ని దరఖాస్తు చేయండి. సుమారు ఒక గంట అలాగే ఉంచి మైల్డ్ షాంపూతో బాగా కడగాలి. ఈ పద్ధతిని వారానికి మూడుసార్లు ఫాలో చేయండి.

గమనిక : తెల్ల జుట్టు ఉన్నవారు హెన్నా పేస్ట్ ని వాడినట్లయితే మీ జుట్టు మెరూన్ రంగుకు మారుతుంది.

పెరుగు

పెరుగు జుట్టు రాలడాన్ని ఆపడం మాత్రమే కాదు మీ కేశాలను సిల్కీ, మెరిసే, మృదువైనవిగా కూడా చేస్తుంది. కర్డ్ ప్యాక్ తయారు చేయడానికి, పెరుగుని కొద్దిగా ఆవాల పేస్ట్‌తో కలపండి. పెరుగును హెన్నా ప్యాక్లలో కూడా ఉపయోగిస్తారు.

వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ ని ఉపయోగించవచ్చు. ఉపయోగించిన తర్వాత ఒక షాంపూతో తల స్నానం చేయటం మర్చిపోకండి.

ఆపిల్ సీడర్ వినిగర్

ఆపిల్ సీడర్ వినిగర్ ని కొద్దిగ నీలతో డైల్యూట్ చేసుకొని ప్రతి సారి మీరు తల స్నానం చేసే ముందు మీ కురులపై మరియు స్కాల్ప్ పై రాయండి. ఆపిల్ సీడర్ వినిగర్ యొక్క వాసనను తొలగించాలనుకుంటే కొద్దిగా రోజ్ మేరీ నూనెని కలుపుకోవచ్చు.

ద్రాక్ష గింజల నూనె

ఈ నూనె హెయిర్ ని కండీషన్, బలంగా చేస్తుంది. అంతే కాదు చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. ద్రాక్ష విత్తనాల నూనెని తయారుచేయడానికి నీటిలో విత్తనాలను వేసి బాగా ఉడికించండి. ఇలా నీటిని మరిగించడం ద్వారా నూనెని సేకరించవచ్చు.

షికాకై

మార్కెట్లో షాపులు మరియు సబ్బులు అందుబాటులో లేని రోజుల్లో అందరూ షికాకైనే ఉపయోగించేవారు. వీటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు పైగా కురులకు కావాలసిన అన్ని పోషకాలను అందిస్తుంది. దీని వలన మీ జుట్టు మందంగా పెరుగుతుంది. కనుక కెమికల్స్ తో కూడిన షాంపూలకు బదులుగా షికకైని ఉపయోగించటానికి ప్రయత్నించండి.

ఉల్లిపాయ రసం

మనలో చాలా మందికి ఇప్పటికీ ఉల్లిపాయ యొక్క ప్రయోజనాల గురించి తెలియదు. ఉల్లిపాయ నుండి రసంను తీసి, మీ జుట్టు మీద దరఖాస్తు చేసుకోవచ్చు. రాసిన 30 నిమిషాల తరువాత తల స్నానం చేయండి. ఇది మీ జుట్టు, స్కాల్ప్ మరియు జుట్టు వేర్లపై కూడా రాయండి.

ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది చాలా ప్రభావితమైన ఒక రెమిడీ.

గ్రీన్ టీ

గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని అందరికీ తెలుసు. అలాగే హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి గ్రీన్ టీ ని మీ జుట్టు మీద దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మూలికా టీ జుట్టు యొక్క పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉత్తమమైన పదార్ధాలను కలిగి ఉంటుంది. మీరు గ్రీన్ టీ ఉపయోగించి జుట్టుని కడగవచ్చు లేదా ఈ టీ ని మీ జుట్టుకు మాస్క్ లాగా వాడవచ్చు.

ఆమ్లా, కలబంద, వేప

ఈ పదార్థాలు మీ హెయిర్ ఫాల్ ని తగ్గించడం మాత్రమే కాదు చుండ్రులను కూడా తొలగిస్తుంది. స్కాల్ప్ పై చికాకు మరియు దురదను కూడా తగ్గిస్తుంది.

అన్ని పదార్ధాలనూ సమాన భాగాలుగా తీసుకొని బాగా రుబ్బుకోవాలి. ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తలపై రాసి ఒక గంట సేపు తరువాత తల స్నానం చేయండి. సమర్థవంతమైన ఫలితాల కోసం నెలకు రెండుసార్లు ఉపయోగించండి.

మెంతులు

మెంతులలో నికోటినిక్ ఆమ్లం మరియు జుట్టు పెరుగుదలకు కావలసిన ప్రోటీన్లు ఉంటాయి. మీ వెంట్రుకలను మృదువుగా చేయడానికి రాత్రిపూట విత్తనాలను నీటిలో నానబెట్టి ఉదయం పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని మీ జుట్టు మీద రాసి ఒక గంటసేపు తర్వాత నీటితో కడగండి. సమర్ధమైన ఫలితాలకు వారానికి రెండుసార్లు ఉపయోగించండి.

లైకోరైస్ వేర్లు

ఇది హెయిర్ ఫాల్ ని తగ్గించడంతో పాటు స్కాల్ప్ ని మృదువుగా చేస్తుంది. పాలు లో లైకోరైస్ వేర్లను రాత్రంతా నానపెట్టి ఉదయం ఒక పేస్ట్ లా తయారు చేసుకొని మీ తలపై రాసి గంట తరువాత తలస్నానం చేయండి. ఈ పేస్ట్ ని రాత్రంతా తలపై ఉంచి ఉదయం కూడా కడగవచ్చు, లేదా మీరు మార్కెట్ లో దొరికే లికోరైస్ root టాబ్లెట్స్ ను కూడా ఉపయోగించవచ్చు.

మందార ఆకులు మరియు పువ్వులు

హైబ్బిస్కస్ ఆకులు హెయిర్ ఫాల్ ని నివారించడానికి మరియు జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. ఇది స్ప్లిట్‌ ఎండ్స్ మరియు చుండ్రుని కూడా నివారిస్తుంది.

 • కొంచం కొబ్బరి నూనెలో 12-15 మందార పువ్వులను వేసి బాగా వేడి చేయండి. చల్లారిన తరువాత ఈ నూనెని వడకట్టి రాత్రి  పడుకునే ముందు తలపై రాసి ఉదయం కడగాలి.
 • మందార ఆకులను రుబ్బి తల స్నానం చేసే ఒక గంట ముందు స్కాల్ప్ మరియు కురులపై రాయండి.

హెయిర్ ఫాల్ తగ్గడానికి తప్పకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

జుట్టు యొక్క ఆరోగ్యం కేవలం బాహ్య అనువర్తనాలపై ఆధారపడి ఉండదు, సరైన ఆహారం చాలా అవసరం. పోషకాలు, ప్రోటీన్లు మరియు విటమిన్లు కలిగి ఉన్న ఆహారాన్ని మీ డైట్ లో జోడించండి. విత్తనాలు, గింజలు, పండ్లు మరియు కూరగాయలు నుండి తయారు చేసిన ఆహారం జుట్టు పెరుగుదలకు ముఖ్యమైన పోషకాలు మరియు ప్రోటీన్లను అందిస్తుంది.

పాలు, ఈస్ట్, కాలేయం, తేనె, కూరగాయల నూనెలు, గోధుమ బీజాలు మరియు గుడ్లు వంటివి జుట్టు పెరుగుదలను పెంచుతాయి.

అవిసె గింజలు

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇది మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు హెయిర్ ఫాల్ ని ఆపుతుంది. ఒక గ్లాసు నీటితో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ ని తీసుకోండి. సూప్, స్మూతీస్ మరియు సలాడ్లలో కూడా దీన్ని చేర్చుకోవచ్చు.

బీట్ రూటు రసం

ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్ బి మరియు సి సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకాలు జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. మీరు ప్రతిరోజూ బీట్ రూటు జ్యూస్ని త్రాగవచ్చు మరియు ఈ కూరగాయని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు

ఐరన్ రిచ్ ఆహారాలు హెయిర్ ఫాల్ ని తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. శరీరంలో ఐరన్ లేకపోవడం అధిక హెయిర్ ఫాల్ కు కారణమవుతుంది. మీ రోజువారీ ఆహారంలో నల్లజాతి ముల్లంగి, ఆకుకూరలు, జీడి, డ్రై ఫ్రూట్స్, అత్తి పండ్లను మరియు బెర్రీలను చేర్చుకోండి. మాంసం మరియు పౌల్ట్రీ లో కూడా ఐరన్ ఉంటుంది.

పాలకూర

పాలకూరని ఉపయోగించి జుట్టు రాలడాన్ని నిరోధించవచ్చు. బచ్చలి కూర మరియు పాలకూర నుండి ఒక అర లీటర్ జ్యూస్ ని తయారు చేసి ప్రతి రోజూ త్రాగండి. ఇది మీ కురుల పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

ఒతైన కురుల కొరకు కొన్ని టిప్స్

 • చాలా సందర్భాలలో మన కురులలో స్ప్లిట్‌ ఎండ్స్ ఉండటం గమనించి ఉంటాము. కనుక ప్రతి 6 నుండి 8 వారాలకు ఒకసారి, మీ జుట్టు యొక్క టిప్స్ భాగాలను కత్తిరించాలి (ట్రిమ్ చేయాలి). స్ప్లిట్‌ ఎండ్స్ ని తొలగించటం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది.
 • వేడి నీటి స్నానం వలన మీ జుట్టు యొక్క తంతువులు డీహైడ్రేట్ కావచ్చు. ఇది మీ స్కాల్ప్ నుండి సహజ నూనెలను తొలగిస్తుంది, మరియు మీ జుట్టు పొడిగా అవుతుంది. జుట్టుని శుభ్రపరచడానికి వెచ్చని నీటిని లేదా సాధారణ నీటిని ఉపయోగించండి.
 • తడిగా ఉన్నప్పుడు మీ జుట్టుని ఎప్పుడూ దువ్వ కూడదు. జుట్టు ఆరే వరకు ఆగి ఆ తరువాత మీకు కావలసిన హెయిర్ స్టైల్ చేసుకోండి.
 • ఈ రోజుల్లో మనం జుట్టు మీద సాధారణ నూనె రాయటం గురించి పూర్తిగా మర్చిపోయాము. కానీ జుట్టుకు నూనె రాయటం అవసరం. మనము జీవించటానికి ఆహారాన్ని తినే విధంగా;
 • మన జుట్టు మనుగడకు కూడా ఆహారం అవసరం. ఈ నూనె ప్రతి జుట్టు యొక్క మూలాలు లోకి వెళ్లి పోషణను అందిస్తుంది. కొబ్బరి, బాదం లేదా ఆలివ్ నూనెలు వంటి సహజ నూనెలను ఉపయోగించవచ్చు.
 • వారానికి రెండు సార్లు తప్పకుండా తల స్నానం చేయండి. ముఖ్యంగా ఎండా కాలంలో.
 • మీ హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ను సందర్శించండి.
 • యోగా మరియు మెడిటేషన్ చేయటం వలన హెయిర్ ఫాల్ కి కారణమైన మీ ఒత్తిడి తగ్గుతుంది.

హెయిర్ ఫాల్ సమస్యను నివారించే యోగాసనాలు

శరీరాన్ని ముందుకు వంచి చేసే యోగాసనాలు తల భాగానికి రక్తప్రసరణను అధికరిస్తుంది. దీని వలన జుట్టు కుదుళ్లు క్రమంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ క్రింది ఆసనాలు తప్పక ప్రయత్నించండి:

అదోముఖ శవాసనం

తలకు, రక్తప్రసరణను బాగా పెంచే ఈ ఆసనం సైనస్ వ్యాధికి, జలుబుకు కూడా మంచిది. హెయిర్ ఫాల్ సమస్యకు ముఖ్య కారణం అయిన మానసిక అలసట, వ్యాకులత, నిద్ర లేమిని తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.

ఉత్థానాసనం

ఈ ఆసనం అలసటను తగ్గించటంలో సహాయపడుతుంది. స్త్రీలకు మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వజ్రాసనం

మిగిలిన ఆసనాలకు భిన్నంగా ఈ వజ్రాసనాన్ని భోజనం చేసిన తరువాత కూడా వేయవచ్చు. ఈ ఆసనం హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయటంతో పాటు మూత్రాశయంలో సమస్యలను పరిష్కరిస్తుంది. బరువు తగ్గటంలో సహాయపడటంతోపాటు జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి కడుపులో గ్యాస్ ను తగ్గిస్తుంది.

అపానాసనం

జీర్ణవ్యవస్థలో ఉండే ప్రాణశక్తికి అపానం అని పేరు. అపానాసనం మన శరీరంలోని విషాలను తొలగించటంలో సహాయపడుతుంది. బుద్ధికి స్పష్టత చేకూరుస్తుంది. మలబద్ధకంనుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

పవనముక్తాసనం

కడుపులో వాయువును (గ్యాస్ ను) తగ్గిస్తుంది, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. వెన్నెముక క్రిందిభాగంలోని కండరాలు శక్తివంతం అవుతాయి. ఉదర భాగంలో, పిరుదులలోని కొవ్వును తగ్గిస్తుంది. రక్తప్రసరణను మెరుగు పరిచి హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తుంది.

సర్వాంగాసనం

థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా ఊపిరితిత్తులు, అన్నవాహిక, జననేంద్రియాలు, నాడీ వ్యవస్థలు ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ద్వారా మెదడులోని కణాలకు మరింత ప్రాణవాయువు అందుతుంది. ఆ విధంగా ఇది నాడీ వ్యవస్థకు చాలా మంచిది. శరీరంలోని విషపదార్థాలను నిర్మూలించి, స్థూలకాయం, మధుమేహాలను తగ్గించటంలో సహాయపడుతుంది.

భస్త్రిక ప్రాణాయామం

శరీరంలో అధికంగా ఉన్న వాత, పిత్త, శ్లేష్మాలను తొలగించటం ద్వారా నాడీవ్యవస్థను శుద్ధి చేస్తుంది. తద్వారా అనేక వ్యాధులను నివారిస్తుంది.

నాడీశోధన ప్రాణాయామం

గుండె సంబంధిత వ్యాధులను, ఆస్త్మా, కీళ్ల నొప్పులు, కుంగుబాటు, మైగ్రెయిన్, మానసిక ఒత్తిడి, కంటి, చెవులకు సంబంధించిన వ్యాధులను తగ్గించటంలో సహాయపడుతుంది.