Posted on

Telugu tips for thick eyebrows – దట్టమైన కనుబొమ్మలను పొందటం ఎలా?

ప్రతి స్త్రీ ముఖంలో అత్యంత ముఖ్యమైన ఫీచర్ లో కనుబొమ్మలు ఒకటి. మీ అందాన్ని హైలైట్ చేసే ముఖ అంశాలలో ఇది ఒకటి. ఈ రోజుల్లో ఎంతో మంది అమ్మాయిలు ప్రతి నెలా త్రెడింగ్ చేసుకోడానికి బ్యూటీ పార్లర్ కు వెళ్తుండటం మనం గమనించే ఉంటాము. త్రెడింగ్ చేసుకోవటం వలన కనుబొమ్మలు అద్భుతమైన ఆకారంలోకి మారుతాయి.

సన్నని మరియు తక్కువ వెంట్రుకలు ఉండే కనుబొమ్మలు ముఖానికి డల్ మరియు ఏజ్డ్ లుక్ ని ఇస్తుంది. కనుబొమ్మలను కత్తిరించడం, థ్రెడింగ్ మరియు వ్యాక్సింగ్ ఎక్కువగా చేయటం వలన అవి తిన్ గా అయ్యే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు వృద్ధాప్యం, పోషకాహార లోపాలు, కాస్మెటిక్స్ మరియు కొన్ని థైరాయిడిజం వంటి వైద్య పరిస్థితులు కూడా కనుబొమ్మలు సన్నబడటానికి కారణమవుతాయి. కీమోథెరపీ మరియు రేడియేషన్ వంటి చికిత్సలు కూడా కనుబొమ్మలకు హానికరం.

ఖచ్చితమైన మందపాటి కనుబొమ్మలు మీ ముఖాన్ని మరింత అందంగా చేస్తుంది. మందపాటి కనుబొమ్మలు ఉన్నట్లయితే మీరు దానిని ఏ పద్ధతిలోనైనా రూపొందించవచ్చు. కానీ, అనేక సందర్భాల్లో, కనుబొమ్మలలో తగినంత వెంట్రుకలు ఉండవు. ఈ సమస్యను కొన్ని ఇంటి నివారణల సహాయంతో సులభంగా పరిష్కరించవచ్చు. ఆ చిట్కాలు మరియు రెమిడీస్ ఏంటో చూద్దాం రండి.

మందపాటి కనుబొమ్మలు పెరగడానికి ఇంటి నివారణలు

ఆముదము

కాస్టర్ ఆయిల్ ఒక పాత కాలపు పద్దతి. ఈ టెక్నిక్ని చాలా మంది ప్రయత్నించారు. ఇది మందపాటి కనుబొమ్మలను ఇవ్వగలదని రుజువైంది. మీరు ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మీ కనుబొమ్మల మీద ఆముదాన్ని రాయండి. ఈ నూనె జుట్టు యొక్క వేర్ల వరకు వెళ్ళడానికి బాగా మసాజ్ చేయండి. ఇది కనుబొమ్మల పెరుగుదలను అడ్డుకునే సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. స్కిన్ తామర, సూక్ష్మజీవుల దాడి మొదలైనవి కనుబొమ్మల పెరుగుదలను దెబ్బతీసే కొన్ని కారణాలు. మీరు ప్రతి రోజూ కాస్టర్ ఆయిల్‌ను క్రమ పద్ధతిలో దరఖాస్తు చేసుకోగలిగినట్లయితే, మీ కనుబొమ్మలు వేగంగా పెడుతాయి.

కలబంద జెల్

అలో వెరా జెల్ కనుబొమ్మ పెరుగుదలను ప్రోత్సహించే ఒక నేచురల్ జెల్. ఇది మీ వెంట్రుకల పుష్టిని మరియు జుట్టు పెరుగుదలను అధికరిస్తుంది. ఇది వెంట్రుకల పెరుగుదలతో పాటు డామేజ్ అయిన జుట్టుని కూడా సరి చేస్తుంది. ప్రతిరోజు ఈ జెల్ ని మీ కనుబొమ్మలపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగండి.

పాలు

పాలు జుట్టు పై సహజ కండీషనర్ లా పనిచేస్తుంది. మీ కనుబొమ్మలు మందంగా పెరగడానికి పాలు ఉపయోగించవచ్చు. చిన్న గిన్నెలో కొద్దిగా పాలను తీసుకోండి. ఒక పత్తిని పాలలో ముంచి దానితో మీ కనుబొమ్మలపై మసాజ్ చేయండి. మీకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఈ పద్దతిని ప్రయత్నించండి. మరో పద్దతి పాలులో నిమ్మరసం కలపవచ్చు. పాలు ఒక గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం చేర్చండి. బాగా కలిపి పత్తితో కనుబొమ్మల మీద దరఖాస్తు చేసుకోండి. 15 నిమిషాల తరువాత నీటితో కడగండి. ఇది మీకు దట్టమైన కనుబొమ్మలను ఇస్తుంది.

ఆలివ్ నూనె

ఆలివ్ ఆయిల్ లోని పోషక గుణాలు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వంట గదిలోనూ ఈ ఆయిల్ ని ఉపయోగిస్తున్నారు. కనుక, మీ ఇంటి కిచెన్లో ఈ నూనె ఉన్నట్లయితే కొంత ఆయిల్ ని బౌల్ లో తీసుకొని పత్తిని ముంచి మీ కనుబొమ్మల మీద దరఖాస్తు చేసుకోండి. కానీ, ఆలివ్ నూనెతో ప్రతి రోజు మీ కనుబొమ్మలను మసాజ్ చేయటం చాలా ముఖ్యం. ముప్పై-నలభై నిమిషాల తరువాత నీటిలో లేదా ఏదైనా క్లేన్సర్ తో తొలగించవచ్చు.

కొబ్బరి నూనె

ప్రతి ఇంట్లోనూ సులభంగా లభించే నూనె కొబ్బరి నూనె. దట్టమైన కనుబొమ్మలను అందించే ఇంగ్రీడియెంట్స్ లో ఇది కూడా ఒకటి. మీ కనుబొమ్మలు చాలా సన్నగా ఉన్నట్లయితే కొబ్బరి నూనె ఒక ఉపయోగకరమైన సహజ నివారిణి. కొన్ని చుక్కల కొబ్బరి నూనెని కనుబొమ్మలపై ప్రతి రోజు రాయండి. మీ కనుబొమ్మలు నల్లగా మరియు మందంగా పెరుగుతాయి.

నిమ్మరసం

జుట్టు పెరుగుదలలో నిమ్మరసం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. తాజా నిమ్మరసం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, నిమ్మరసం మీ అందాన్ని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని చుక్కల నిమ్మరసాన్ని మీ కనుబొమ్మలపై రాసి మృదువుగా మసాజ్ చేసి 10-15 నిమిషాల తరువాత నీటితో కడగండి. మీ కనుబొమ్మలను నిమ్మపండు ముక్కలతో కూడా డైరెక్ట్ గా రుద్దవచ్చు.

ఉల్లిపాయ రసం

ఇది కనుబొమ్మ వెంట్రుకల వేగమైన మరియు దట్టమైన పెరుగుదలలో సహాయపడుతుంది. ఉల్లిపాయలలోని సల్ఫర్ రసం జుట్టు పెరుగుదలకు మరియు హెయిర్ ఫోలిక్స్ ని బలపరచుకోవటానికి అవసరమైన కొల్లాజెన్ కణజాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఐదు నిమిషాలు కనుబొమ్మల మీద ఉల్లిపాయ రసాన్ని మసాజ్ చేయండి మరియు డ్రై అయ్యే వరకు వదిలేయండి. ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా కనీసం ఒక నెల రోజులు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

గుడ్డు యొక్క పచ్చసొన

కనుబొమ్మల జుట్టు కెర్టిన్ ప్రోటీన్‌తో పెంచబడతాయి. గుడ్డు ప్రోటీన్ యొక్క ఉత్తమ మూలం కనుక గుడ్డు కనుబొమ్మల జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుడ్డు యొక్క పచ్చసొనను మందపాటి క్రీములా అయ్యే వరకు బాగా బీట్ చేయాలి. ఆ తరువాత కనుబొమ్మలపై రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి 2 సార్లు కొన్ని నెలల పాటు చేయండి.

మెంతులు

ఇందులో ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం మరియు లెసిథిన్లు పుష్కలంగా ఉన్నందున జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ ను పునర్నిర్మాణం చేయడంలో కూడా సహాయపడుతుంది. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఒక పేస్ట్ లా రుబ్బుకొని అందులో కొబ్బరి నూనెని జోడించండి. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలపై రాసి రాత్రంతా అలాగే వదిలేయండి. ఉదయం వెచ్చని నీటితో కడగండి. ఇలా 2 నెలల పాటు వారానికి 3 సార్లు చేయండి.

బాదం నూనె

ఇందులో విటమిన్ ఏ, బి మరియు ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు పోషకాలను అందించి పెరుగుదలను ప్రేరేపిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో కనుబొమ్మలను మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడగాలి.

విటమిన్ ఇ నూనె

విటమిన్ ఇ నూనె కనుబొమ్మల వెంట్రుకల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెని పిండి, రాత్రి పడుకోబోయే ముందు కనుబొమ్మలకు పూసుకోండి. రాత్రంతా ఉంచి ఉదయం మేకప్ రిమూవర్ తో తొలగించండి. తరువాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇలా వారానికి అయిదారు సార్లు చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా ఎదుగుతాయి.

ఆరోగ్యకరమైనవి ఆహారాన్ని తీసుకోండి

మందపాటి కనుబొమ్మల పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారం కూడా చాలా అవసరం. రెడ్ పెప్పర్స్, తియ్యని బంగాళదుంపలు మరియు క్యారెట్లు వంటి విటమిన్ ఎ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి. రోజువారీ ఆహారంలో బాదం, వేరుశనగలు, బాసిల్, బచ్చలి కూర, ఆలివ్ వంటి విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని జోడించండి. నిమ్మకాయలు, మిరియాలు, బ్రోకలీ, బొప్పాయి మరియు నారింజ వంటి విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోండి. పాల ఉత్పత్తులు, బీన్స్ మరియు కాయ ధాన్యాలు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను మీ డైట్ లో చేర్చండి. అవకాడొలు, వాల్నట్స్, ఆలివ్ నూనె మరియు సాల్మొన్ వంటి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు మరియు చేపలు, ఆకుపచ్చ కూరగాయలు, లీన్ మీట్ వంటి ఐరన్ రిచ్ ఆహారాలను అధికంగా తీసుకోండి.

గుర్తుంచుకోవాల్సిన కొన్ని టిప్స్

  • పై చెప్పిన ఆయిల్స్ లేదా జెల్స్ ని మీరు ఉపయోగించేటప్పుడు వాటితో కనుబొమ్మలను బాగా మసాజ్ చేయాలి. అప్పుడే రక్త ప్రసరణ మెరుగు పొంది ఫలితాలను తొందరగా పొందుతారు.
  • కనుబొమ్మలు డ్రై కాకుండా తేమగా ఉండేందుకు రోజుకు మూడు సార్లు పెట్రోలియం జెల్ ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మీ కనుబొమ్మలలో బలమైన వెంట్రుకలు పెరగటానికి సహాయపడుతుంది.
  • తరచూ వాక్సింగ్, ట్వీజింగ్ మరియు థ్రెడింగ్ చేయకూడదు. వీటిని అతిగా చేయటం వలన కనుబొమ్మలు తిన్ గా అవుతాయి.