Posted on

Telugu tips for long hair – జుట్టు పెరగడానికి చిట్కాలు

ప్రతీ మహిళ పొడవాటి, అందమైన కురులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ రోజుల్లో కొన్ని రకాల జుట్టు సంబంధిత సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోయింది, అలాగే జుట్టు పూర్తిగా పెరగకుండా ఆగిపోవడం కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా మంది మార్కెట్లలో దొరికే రసాయనాలు మరియు కాస్మెటిక్స్ వంటివి వాడి మరింత బాధకు గురవుతున్నారు. కానీ సహజ సిద్ధమైన చిట్కాలతో ఇంట్లోనే మనము ఈ జుట్టు రాలే సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు.

పొడవాటి, జారువాలే జుట్టు కావాలనే కోరిక మీలో ఉంటే, అప్పుడు మీరు చేయవలసినదల్లా జుట్టుకి మంచి పోషణ కలిపించడమే. అందమైన కురుల కోసం ఆహార అలవాట్లను మార్చుకోవడమే కాకుండా బాహ్యంగా కూడా కొంత రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పొడవాటి, ధృడమైన కురులను పొందడానికి కొన్ని గృహ చిట్కాలు ఇలా ఉన్నాయి.

జుట్టు పొడవుగా పెరుగుటకు సహజ గృహ చిట్కాలు

త్వరిత జుట్టు పెరుగుదలకు ఆవాల పొడితో హెయిర్ ప్యాక్

ఒక టేబుల్ స్పూన్ ఆవాల పొడికి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె, ఒక గుడ్డు, కొన్ని చుక్కల నీటిని జోడించి బాగా కలపండి. ఆ పేస్టుని ముఖ్యంగా మీ తల పై భాగ చర్మానికి అలాగే మీ జుట్టు మొత్తానికి పట్టించండి. ఒక షవర్ కేప్ పెట్టుకుని 20 నుండి 30 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రపరుచుకోండి. ఆవాలు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది కనుక ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది.

జుట్టు రాలే సమస్యను నివారించుటకు ఆముదము

జుట్టు పెరుగుదలకు ఆముదము ఒక మంచి ఎంపిక. ఆముదం నూనెని జుట్టుకి బాగా పట్టించి రాత్రంతా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యని ఆపవచ్చు. ఆముదం నూనెని మరొక పద్ధతిలో కూడా వాడవచ్చు. బాదం నూనెలో ఆముదం నూనెని కలిపి మాడుకి బాగా మసాజ్ చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యే కాకుండా పల్చని జుట్టు, బట్ట తల వంటి సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది.

మృదువైన కురులకి మెంతులు

మెంతులని ఉపయోగించి మీ జుట్టు పరిమానముని పెంచుకోండి. రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు వాటిని మెత్తని పేస్టులా తయారు చేసుకోండి. మీ మాడుకి మరియు జుట్టుకి ఈ పేస్టుని పట్టించి 30 నుండి 40 నిముషాల వరకు ఉంచండి. తరువాత తేలికపాటి షాంపూతో జుట్టుని బాగా శుభ్రం చేసుకోండి. ఇదే పద్ధతిని నెలల వారీగా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వలన జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు. ఇలా చేయడం వలన కురులు మెరుస్తూ మృదువుగా మారుతాయి.

విటమిన్లతో జుట్టు పరిమాణము పెంచడం ఎలా?

జుట్టుకి బాహ్యంగా హెయిర్ ప్యాక్ లు, మసాజ్ లు వంటివి చేయడంతో పాటుగా అంతర్గతంగా కూడా కొన్ని జాగ్రత్తలు వహించడం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారంలో విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉండేలా చూసుకోవాలి. ఇవి మన జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడతాయి.

పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, కేరెట్లు మరియు పెరుగు వంటివి మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. ఎక్కువగా నూనె పదార్ధాలతో చేసిన ఆహారానికి దూరంగా ఉండండి. ఆహారపు నిర్వహణ చూడటానికి సులువుగా ఉంటుంది. కానీ దానిని పధ్ధతి ప్రకారం పాటించి ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలను ఇస్తుంది.

A, C మరియు E విటమిన్లు ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే కురులు మృదువుగా, జారువాలేలా పెరుగుతాయి. ఫోలిక్ ఆసిడ్ మరియు బయోటిన్ మాత్రలను తీసుకుంటే జుట్టు స్ట్రెయిట్ గా ఉంటుంది. కానీ మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మరియు మీ జుట్టుకు వాడే మందులను గురుంచి ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించి సలహాలు తీసుకోండి.

జుట్టు పెరుగుదలకు లోతైన కండీషనింగ్

జుట్టుకి మంచి పోషణ కలిపించడానికి బోల్డన్ని చిట్కాలు ఉన్నాయి. మీ జుట్టుకి పోషణ అందించడానికి ఆలివ్ నూనె, గుడ్డు, తేనె వంటివి వాడి చూడండి. జుట్టుకి కండీషనింగ్ చేయడం వలన మీరు ఆరోగ్యవంతమైన, పొడవాటి, మెరిసే జుట్టుని పొందుతారు.

జుట్టు రాలే సమస్యకు కొబ్బరి నూనె చికిత్స

పలు రకాల జుట్టు సమస్యలకు కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ గృహ చికిత్సగా ఎప్పటి నుండో పేరుగాంచింది. మీ జుట్టు పెరుగుదల చాలా తక్కువగా ఉంటే, సహజంగా పొందిన కొబ్బరి నూనెతో మాడుకి మరియు మొత్తం కురులకి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకునే ముందు కొబ్బరి నూనెని కాసేపు వేడి చేసి రాసుకుంటే మరింత అద్భుతంగా పనిచేస్తుంది. మీ చేతి వ్రేళ్ళను ఉపయోగించి మీ జుట్టు పై భాగానికి కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేసుకోండి.

జుట్టు పెరుగుదలకు కురులను ముందుకు వాల్చటం

కొన్ని ఆరోగ్యకరమైన కార్యకలాపాలు కూడా జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. వాటిలో ఒక పధ్ధతి కురులను ముందుకు వాల్చడం. ఇలా చేయడం వలన తల పై భాగ చర్మం మీద రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా జుట్టు చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. కనుక రోజులో 2 నుండి 3 సార్లు ఇలా జుట్టుని ముందుకి వాల్చి కనీసం 30 సెకనులు అలా ఉంచి తిరిగి జుట్టుని వెనక్కి వేయండి.

జుట్టు పరిమాణము పెంచడానికి గుడ్డు

గుడ్డు ప్రోటీన్లను కలిగి ఉంటుంది. అది మీ జుట్టు పెరుగుదలకు చాలా సహాయపడుతుంది. ముఖంగా గుడ్డులోని పచ్చ సొన జుట్టు పెరుగుదలకు మరియు దాని పోషకానికి చాలా అవసరం. ఇందుకోసం ఒక గుడ్డుని తీసుకుని పగలగొట్టి ఒక గిన్నెలో తీసుకోండి.  దానికి ఒక చెంచా ఆలివ్ నూనె మరియు సగం చెక్క నిమ్మరసాన్ని జోడించండి. ఇప్పుడు వాటిని బాగా కలిపి మీ జుట్టుకి, మాడుకి పట్టించండి. జుట్టు ఆరెంతవరకూ కాసేపు ఉంచి అప్పుడు చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. పచ్చి గుడ్డు వాడటం వలన కాస్త వాసన రావొచ్చు అందుకని తేలికపాటి షాంపూని ఉపయోగించి జుట్టుని శుభ్రం చేసుకోండి.