
మన రాష్ట్రాలలో ముఖ్యంగా రాయలసీమలో బొబ్బట్లు ఎంతో ప్రసిద్ధమైన తీపి పదార్థం. ఉగాది వంటి పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఎంతో ఇష్టంగా చేసుకొని నెయ్యి లేదా పాలతో తింటారు. వీటిని ఓళిగలు అని కూడా అంటారు.
ఇటీవలే వచ్చిన వార్తల్లో అనంతపురం జిల్లాలో ఓళిగలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారట. ఓళిగలలో ఎన్నో రకాలు ఉన్నాయి. పిండి ఓళిగలు, కొబ్బరి ఓళిగలు, కోవా ఓళిగలు ఇంకా మరెన్నో. మరి ఎంతో సులువైన పిండి ఓళిగలను ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
- మైదా – 1 కప్పు
- శనగ పిండి – 1 కప్పు
- బెల్లం తురుము – 1 కప్పు
- బాదాం మరియు జీడి పప్పు పొడి – 1 కప్పు
- ఉప్పు – 1 స్పూన్
- యాలుకల పొడి – 1 స్పూన్
- నూనె / నెయ్యి – 2 స్పూన్లు
తయారీ విధానం
- ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ నెయ్యి మరియు కొంత నీళ్లు పోసుకొని గెడ్డలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు శనగ పప్పులు వేసి తగినంత నీళ్లు పోసి, మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి.
- ఉడికిన శనగ పప్పుని స్ట్రెయినర్ లో వేసి నీళ్లన్నీ పోయాక మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఒక బౌల్ లో ఈ గ్రైండ్ చేసిన శనగ పప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు బాదాం జీడీ పప్పు పొడి, 1 టీ స్పూన్ యాలుకల పొడి వేసి ముద్దగా కలుపుకోవాలి.
- ఇప్పుడొక చపాతీ చెక్కపై పాలిథిన్ కవర్ పై నెయ్యి రాసి ముందే సిద్ధం చేసి పెట్టుకున్న మైదా పిండిని కొద్దిగా తీసుకొని కవర్ మధ్యలో ఉంచి పల్చగా వొత్తి, అందులో స్టఫింగ్ పెట్టి, అన్ని వైపులా పిండి కవర్ చేసి బాల్ లా చేసుకోవాలి.
- దానికి నెయ్యి రాసి పాలిథిన్ కవర్ మధ్యలో పెట్టి చపాతీ షేప్ వచ్చేలా చేతితో పల్చగా ఒత్తుకోవాలి.
- ఇప్పుడొక తవా పై నెయ్యి రాసి, సిద్ధం చేసుకున్న బొబ్బట్టుని వేసి రెండు వైపులా నెయ్యితో ఎర్రగా కాల్చుకోవాలి.
- ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన నేతి బొబ్బట్లు రెడీ!