Posted on

Onion juice for hair growth in Telugu – బట్ట తల పై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి?

జుట్టు పాపడి వద్ద పలుచబడుతోందా? మీ మాడు పై బట్టతల ప్యాచెస్ ఏర్పడుతున్నాయా? ఒక వయసు తరువాత (వృధాప్యంలో) ఇలాంటి సమస్యలు ఏర్పడితే పెద్ద సమస్యగా అనిపించదు కానీ యవ్వనంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే! వీటితో పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. పబ్లిక్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

బాల్డ్ ప్యాచెస్ కనపడకుండా ఉండేందుకు మరియు పలుచబడిన జుట్టు ఒత్తుగా కనిపించేలా చేసేందుకు ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ ని ట్రై చేస్తాము. అంతేకాదు, ఈ సమస్యను ట్రీట్ చేసేందుకు ఎన్నో ఖరీదైన నూనెలను మరియు ట్రీట్‌మెంట్లను ట్రై చేసి ఉంటాము.

కానీ ఎక్కువ ఖర్చు లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని ఉత్తమ హోమ్ రెమిడీస్ ని ఉపయోగించి ఈ సమస్యను క్యూర్ చేయవచ్చు. మరి ఈ సమస్యలకు కారణాలు ఏంటి? ఈ సమస్యలను ట్రీట్ చేసేందుకు ఉల్లిపాయతో తయారు చేసుకొనే ఉత్తమ హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం. మరియు బట్టతల యొక్క  వైద్య చికిత్సల గురించి కూడా ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

బట్టతల

బట్టతల వంశపారంపర్యంగా వచ్చే సమస్య. జన్యు ప్రభావాలతో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అందుకే దీన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అని అంటారు. ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే బట్టతల సమస్య ప్రస్తుత కాలంలో 20 ఏళ్లలోనే మొదలవుతోంది. జన్యువులు త్వరగా వ్యక్తీకరణ కావటం ఇందుకు దోహదం చేస్తోంది.

మన ఆహార అలవాట్లు మారటం, పెరుగుతున్న కాలుష్యం లాంటి విషయాలు దీనికి పురికొల్పుతున్నాయి. తండ్రి, తాతలకు బట్టతల ఉంటేనే తర్వాతి తరానికి వస్తుందని కొందరు భావిస్తుంటారు. తల్లి, అమ్మమ్మలకు బట్టతల ఉన్నా వారి వంశావళిలోని వారసులకు రావొచ్చు.

తండ్రికి, తల్లికి ఇద్దరికీ బట్టతల ఉంటే మరింత త్వరగా వచ్చే అవకాశముంది. సాధారణంగా బట్టతల మగవారికే వస్తుందని భావిస్తుంటారు, కానీ ఆడవారికి కూడా వస్తుంది. కాకపోతే వేరుగా ఉంటుంది. మగవారిలో ఆయా భాగాల్లో జుట్టు మొత్తం ఊడిపోతే, ఆడవారిలో మధ్యమధ్యలో వెంట్రుకలు ఊడిపోయి, జుట్టు పలుచగా అవుతుంది.

మగవారిలో కణతల దగ్గర్నుంచి వెంట్రుకలు ఊడిపోవటం మొదలై క్రమంగా నుదురు మీది వరకు ‘ఎం’ ఆకారంలో వెంట్రుకలు రాలిపోతుంటాయి. కొందరికి కేవలం మాడు మధ్యలో గుండ్రంగా జుట్టు మొత్తం పోవచ్చు. తల వెనక భాగంలోని వెంట్రుకలు బలంగా ఉంటాయి. ఇవి త్వరగా ఊడిపోవు. అందుకే చాలామందిలో తల వెనక గుర్రపు నాడా ఆకారంలో జుట్టు రాలిపోకుండా ఉంటుంది.

బాల్డ్ ప్యాచెస్ మరియు థిన్ హెయిర్ సమస్య యొక్క కారణాలు

  • వీటికి ముఖ్య కారణం ఐరన్, సల్ఫర్ మరియు విటమిన్ ల యొక్క లోపం.
  • ఇన్ఫెక్షన్ లేదా జన్యు కారణాల వాళ్ళ కూడా కావచ్చు.
  • ప్రస్తుత కాలంలో అధికరిస్తున్న కాలుష్యం కూడా ఒక ముఖ్య కారణం. కాలుష్యం మరియు చెమట వలన స్కాల్ప్ పై మురికి పేరుకుపోయి హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది.
  • అధిక ఒత్తిడి మరియు మారిపోయిన జీవనశైలి.

హెయిర్ గ్రోత్ మరియు బాల్డ్ హెడ్ చికిత్సకు ఉల్లిపాయలు ఎలా ఉపయోగపడతాయి?

మనకు ఇష్టమైన వంటకాల్లో ఉల్లిపాయలను చేర్చుకుంటాం. ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు గురించి మన అందరికీ బాగా తెలుసు. కానీ ఉల్లిపాయలు జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకు కారణం ఉల్లిపాయ యొక్క వాసన. ఉల్లిపాయల యొక్క వాసన నచ్చనందున బ్యూటీ టిప్స్ కి దీన్ని చాలా అరుదుగా ఉపయోగిస్తారు.

2002 లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ లో ప్రచురించబడిన ఒక పత్రికలో ‘అలోపీశియా ఏరియేట’ అనే ఒక రకమైన బట్ట తలను పోగొట్టడంలో ఉల్లిపాయ యొక్క సామర్థ్యం రుజువైంది. దీనిపై తదుపరి పరిశోధనలు కూడా ఉన్నాయి, అన్ని పరిశోధనలూ దీని ప్రభావాన్ని గుర్తించాయి.

ఉల్లిపాయ ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్. ఇది స్కాల్ప్ పై ఎలాంటి సంక్రమణం కూడా ఏర్పడకుండా శుభ్రంగా ఉంచడానికి అత్యంత ప్రభావితంగా పనిచేస్తుంది. చుండ్రుని కూడా తొలగిస్తుంది. వాటితో పాటు జుట్టు మూలాలను శుభ్రపరచి మాడును ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

మన శరీరంలో ముఖ్యమైన ఆధార మూలకాల్లో ఒకటి సల్ఫర్. వెంట్రుకలు, గోర్లు మరియు చర్మంలో సల్ఫర్ ప్రధానంగా ఉంటాయి. ఉల్లిపాయలలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది స్కాల్ప్ పై వాపు మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు జుట్టు ఫోలికల్స్ ని ఉత్తేజ పరుస్తుంది.

జుట్టు మూలాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ చేరడం ద్వారా సంభవించే ఆక్సిడేటివ్ ఒత్తిడి తరచుగా జుట్టు సన్నబడటానికి కారణమవుతుంది మరియు సహజమైన యాంటీ ఆక్సిడెంట్లను తగ్గించి అకాలంలో తెల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది. ఉల్లిపాయ రసం స్కాల్ప్ పై కెటలాస్ (ఒక రకమైన ఎంజైమ్) స్థాయిని పెంచుతుంది, ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ సన్నాహాన్ని నియంత్రిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఉల్లిపాయలు హెయిర్ ఫోలికల్స్ కు పోషణను అందించగలుగుతుంది కనుక పురుషులలో జన్యుపరమైన కారణాల వలన ఏర్పడిన బాల్డ్ ప్యాచెస్ ని కూడా ట్రీట్ చేసేందుకు సహాయపడుతుంది.

జుట్టు సమస్యలను నివారించడంలో ఉల్లిపాయల యొక్క ఉపయోగాలను తెలుసున్నారు కదా! మరి ఎలా ఉపయోగించాలి అన్న వివరాలను తెలుసుకుందాం రండి.

ఉల్లిపాయ రసం ని తయారు చేసే విధానం

మీ కురులకు సరిపడేన్ని ఉల్లిపాయలను తీసుకొని తోలు తీసి శుభ్రమైన నీళ్లతో కడగాలి. ఆ తరువాత ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్ లో వేసి 2 నిమిషాల పాటు రుబ్బాలి. కావల్సినంత నీళ్లను చేర్చుకొని రుబ్బుకోవచ్చు.

రుబ్బిన ఉల్లిపాయలను ఫిల్టర్ లో లేదా శుభ్రమైన కాటన్ వస్త్రంలో గాని వేసి పిండితే ఉల్లిపాయ రసం రెడీ అవుతుంది. లేదా ఉల్లిపాయను గ్రేట్ చేసి వాటిని పిండి కూడా రసం తయారు చేసుకోవచ్చు. జుట్టుపై వాడేటప్పుడు ఎల్లప్పుడూ తాజా ఉల్లిపాయ రసం ని మాత్రమే ఉపయోగించాలి.

ఉల్లిపాయ రసం తయారు చేసుకున్న తరువాత హెయిర్ ఫాల్ మరియు బాల్డ్ ప్యాచెస్ ని తొలగించేందుకు క్రింద చెప్పిన అనేక రకాలుగా ఉపయోగించవచ్చు.

ఉల్లిపాయ రసంను ఉపయోగించే సులభమైన పద్ధతులు

వట్టి ఉల్లిపాయ రసం

అవును, వట్టి ఉల్లిపాయ రసాన్ని మీ స్కాల్ప్ పై డైరెక్ట్ గా అప్‌లై చేయవచ్చు. మీ చేతి వేలతో స్కాల్ప్ పై రాసి ఆ తరువాత జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పూర్తిగా రాయండి. బాల్డ్ ప్యాచెస్ మరియు థిన్ హెయిర్ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో గ్యాప్ లేకుండా రాయాలి. బాగా రాసిన తరువాత గంట సేపు ఉంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో కడగాలి.

గమనిక : ఉల్లిపాయ రసం ఉపయోగించిన తర్వాత కెమికల్స్ అధికంగా ఉండే షాంపూ ను ఉపయోగించకండి. మైల్డ్ లేదా హెర్బల్ షాంపూ ను ఉపయోగిస్తే మంచిది.

ఉల్లిపాయ రసం మరియు తేనె

తేనెలో అనేక ఔషధ గుణాలున్నాయని మన అందరికీ తెలిసిందే. ఇది చర్మం మరియు కేశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటానికి కూడా సహాయపడుతుంది.

ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత స్కాల్ప్ పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా మైల్డ్ షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు కలబంద

జుట్టు పెరుగుదలను ప్రేరేపించేందుకు మరియు జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు కలబంద ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తాజాగా తయారు చేసిన ఒక కప్పు ఉల్లిపాయ రసం లో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని కలిపి స్కాల్ప్ మరియు కురులపై రాయండి. బాగా అప్‌లై చేసినట్టు నిర్ధారించుకోండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి మంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ని జోడించడం వలన ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాన్ని అధికరిస్తుంది. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో రెండు టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెని కలిపి స్కాల్ప్ మరియు కురుల పై రాయండి. రాసిన తరువాత మాడు పై 10 నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి.

ఉల్లిపాయ రసం మరియు రోస్ మేరీ ఆయిల్

రోస్ మేరీ ఆయిల్ హెయిర్ ఫాల్ ని నియంత్రించి కురులు ధృఢంగా పెరిగేందుకు సహాయపడుతుంది. మీకు ఉల్లిపాయల వాసన నచ్చకపోతే ఈ రెమిడీ ని ఫాలో అవ్వండి. ఒక కప్పు ఉల్లిపాయ రసం లో 10-15 చుక్కల రోస్ మేరీ నూనెని వేసి బాగా కలపండి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి బాగా మర్దన చేయండి. ఆ తరువాత గంట సేపు అలాగే ఉంచి నీటితో లేదా తేలిక పాటు షాంపూ తో తల స్నానం చేయండి. రోస్ మేరీ ఆయిల్ ఉల్లిపాయల యొక్క వాసనను తగ్గిస్తుంది.

ఉల్లిపాయ మరియు రమ్

ఉల్లిపాయ యొక్క వాసన నచ్చని వారికి ఈ రెమిడీ ఎంతో ఉత్తమంగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ తోలు వొలిచి చిన్న ముక్కలుగా చేసుకొని ఒక కప్పు రమ్ము లో నానబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఒక గట్టి కంటైనర్ లో మూసి ఒక రోజంతా రూమ్ టెంపరేచర్ లో నానబెట్టండి. ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

ఒక రోజు తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి స్కాల్ప్ పై రాసి మసాజ్ చేసి గంట తరువాత తల స్నానం చేయండి. ఉల్లిపాయల యొక్క శాతం ఇందులో తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని ఉపయోగించటం వలన హెయిర్ సమస్యలపై ప్రభావం తక్కువగానే ఉంటుంది.

హెయిర్ ఫాల్‌ను నియంత్రించడానికి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఉల్లిపాయ రసం యొక్క సామర్ధ్యం మన అందరికీ బాగా తెలిసిందే. జుట్టు సమస్యల నుండి మీరు బాధ పడుతున్నట్లయితే పై చెప్పిన రెమిడీస్ ని ప్రయత్నించండి.

అయితే, వాటి యొక్క ఫలితాలు వ్యక్తిగత శారీరక స్వభావాన్ని బట్టి ఉంటుంది. కనుక రెగ్యులర్ గా ఆనియన్ రెమిడీస్ ని ఉపయోగించినప్పటికీ వెంటనే ఫలితాలు కనిపించకపోతే నిరాశ చెందకండి. ఈ రెమిడీలను కనీసం వారానికి 3 సార్లు 2 నెలల పాటు ఉపయోగిస్తే తప్పుకుంటా మీ జుట్టు పెరుగుదలలో మార్పులను చూడవచ్చు.

బట్టతల సమస్యకు చికిత్సలు

బట్టతల సమస్య కారణాలను తెలుసుకునేందుకు ముందుగా జుట్టు తీరు తెన్నులను, ఇతరత్రా సమస్యలను విశ్లేషించి సమస్యలను గుర్తిస్తారు. అవసరమైతే టైక్రోగ్రామ్ పరీక్ష చేస్తారు. చిన్న చర్మం ముక్క తీసి పరీక్షిస్తారు (బయాప్సీ). ఫంగస్ ఆనవాళ్లను తెలుసుకోవటానికి స్క్రేపింగ్ చేస్తారు. సమస్యను గ్రహించిన తరువాత సమస్యను బట్టి క్రింది చికిత్సలలో ఒక దానిని చేస్తారు.

మందులు

మామూలు సమస్యలతో  జుట్టు ఊడుతున్న వారికి సమస్యకు తగిన లోషన్లతో పాటు ఐరన్, బి విటమిన్లు, విటమిన్ డి3 ని అందిస్తారు. ఈ చికిత్స కొరకు తీసుకునే మందులను డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి.

ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ

ఇందులో ఆయా వ్యక్తుల రక్తాన్ని తీసి, ప్లేట్లెట్లు అధికంగా ఉండే ప్లాస్మా ద్రవాన్ని వేరు చేసి, ఇంజెక్షన్ సాయంతో మాడుపై ఎక్కిస్తారు. ప్లేట్లెట్లలోని వృద్ధి కారకాలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి.

మూలకణ చికిత్స

ఇందులో వెంట్రుకల కుదుళ్లను ప్రయోగశాలలో వృద్ధి చేసి మూలకణాలను సేకరిస్తారు. ఆ తరువాత వీటిని తలపై ప్రవేశపెడతారు. దీంతో వెంట్రుకలు వృద్ధి చెందుతాయి.

స్వల్ప లేజర్ కాంతి చికిత్స

లేజర్ కాంతితో వెంట్రుకల వృద్ధి కారకాలు ఉత్తేజితం అవుతాయి. దీంతో వెంట్రుకలు పెరుగుతాయి.

బట్ట తలకు శాశ్వత పరిష్కారం – జుట్టు మార్పిడి!

బట్టతలకు ఇతరత్రా చికిత్సలు, పద్ధతులేవైనా తాత్కాలికమే. ఉత్తమమైన, శాశ్వతమైన పరిష్కారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఇందులో తలలో ఒక చోట ఉన్న వెంట్రుకలను తీసి బట్టతల ఉన్న భాగంలో నాటుతారు. సాధారణంగా తల వెనక ఉన్న వెంట్రుకలను నాటుతారు.

అవసరమైతే గడ్డం, ఛాతీ వంటి భాగాల నుంచి తీసి తలపై అమర్చొచ్చు. బట్టతల మామూలుగా ఉన్నట్టయితే ఒక రోజులోనే ప్రక్రియ పూర్తవుతుంది. మరీ ఎక్కువగా ఉంటే నెల తర్వాత మరోసారి నాటాల్సి ఉంటుంది. మన వెంట్రుకలు ఒక వైపునకు వాలి ఉంటాయి.

నాటేటప్పుడూ అలాగే అమర్చుతారు. దీంతో సహజంగా కనిపిస్తుంది. తల వెనుక భాగంలో జుట్టు ఎంతో బలంగా ఉంటుంది కనుక అక్కడ నుండి తీసి నాటిన చోట కూడా జుట్టు బలంగా పెరుగుతుంది. చికిత్స అనంతరం జుట్టు త్వరగా, మందంగా పెరగటానికి మందులను ఉపయోగించాల్సి ఉంటుంది.

ట్రాన్స్‌ప్లాంటేషన్ యొక్క పద్ధతులు

స్ట్రిప్ (ఎఫ్యూటీ) పద్ధతి

ఇందులో ఒక్కొక్క వెంట్రుకను తీసి బట్టతల మీద నాటుతారు. తల వెనక ఆక్సిపిటల్ భాగంలో వెంట్రుకలు ఉన్నచోట సుమారు 5-15 సెంటీమీటర్ల చర్మం ముక్కను కత్తిరించి, పక్కన పెడతారు. కుట్లు వేసి కోతను మూసేస్తారు. తర్వాత పక్కన పెట్టిన చర్మంలోని వెంట్రుకలను ఒక్కొక్కటిగా తీసుకొని బట్టతల ఉన్న చోట నాటుతారు.

ఎఫ్యూఈ (ఫాలిక్యులార్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్) పద్ధతి

వెంట్రుకల కుదుళ్లను విడివిడిగా నాటడం దీని ప్రత్యేకత. మన వెంట్రుకల కుదుళ్లలో 2-5 వెంట్రుకలు గుంపుగా ఉంటాయి. ఇలాంటి గుంపులను అక్కడక్కడ్నుంచి తీసి, ప్రత్యేక ద్రవంలో భద్రపరుస్తారు. అనంతరం బట్టతల ఉన్న చోట అమరుస్తారు.

ఇందులో చర్మాన్ని కత్తిరించటమనేది ఉండదు. అందువల్ల మచ్చ పడదు. నొప్పి తక్కువ. ప్రస్తుతం రోబోటిక్ పద్ధతిలోనూ దీన్ని చేస్తున్నారు. అవసరమైతే కొందరికి ఈ రెండు పద్ధతులతోనూ వెంట్రుకలను నాటుతారు.