పైల్స్(మొలలు)తో బాధపడుతున్నారా? – Telugu tips for piles

హెమోరాయిడ్స్‌ని సామాన్య పరిభాషలో పైల్స్ అని అంటారు. తెలుగు భాషలో వీటిని మొలలు / మూలశంక అని అంటారు. కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారికి తరచుగా వచ్చే సమస్య పైల్స్‌. సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి కారణాల వలనే ఈ సమస్య ఏర్పడుతుంది.

బాగా కోపం తెచ్చుకునే వారిని చూసి సాధారణంగా మనం అడిగే ప్రశ్న ఏంటీ? నీకు పైల్స్ ఉన్నాయా’! పైల్స్ అనగానే గుర్తొచ్చేది బాత్‌రూము, అక్కడ పడే బాధలు. అవును ఇది నిజమే. ఉదయం మల విసర్జనకు బాత్‌రూముకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నట్లయితే వారికి పైల్స్(మొలలు) ఉన్నాయని అర్థం. పైల్స్ అంటే ఏమిటి, వీటి కారణాలు మరియు నివారణ పద్దతులను ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.

మొలలు అంటే ఏమిటి?

పురీషనాళం మరియు పాయువు లోపల లేదా చుట్టూ కలిగే వాపుని పైల్స్ అని అంటారు. పురీషనాళం మరియు పాయువు లోని రక్త నాళాలు ఎన్ లార్జ్ అవటం వలన ఈ వాపు ఏర్పడుతుంది.

వాపు యొక్క పరిమాణం మరియు తీవ్రత ఆధారంగా హేమోరాయిడ్లను నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు

మొదటి డిగ్రీ/స్థాయి: పాయువు లోపలి లైనింగ్ భాగంలో అభివృద్ధి చెందుతున్న చిన్న వాపు. ఇవి పాయువు వెలుపల కనిపించవు.

రెండో డిగ్రీ/స్థాయి: పాయువులో పెద్ద వాపు. ఇది మీరు టాయిలెట్కు వెళ్ళినప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్లిపోతుంది.

మూడవ డిగ్రీ/స్థాయి: ఒకటి లేదా అనేక చిన్న మృదువైన గడ్డలు పాయువు నుండి క్రిందకి వ్రేలాడుతుంటాయి. వీటిని లోపలికి తోయవచ్చు.

నాలుగో డిగ్రీ/స్థాయి: పాయువు నుండి పెద్ద గడ్డలు బయటికి వ్రేలాడుతాయి. వీటిని తిరిగి లోపలికి తోయలేము.

మూలశంక రావటానికి కారణాలు

ప్రస్తుత కాలంలో పైల్స్ ఒక పెద్ద సమస్యగా మారినప్పటికీ దీని యొక్క ఖచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది, కానీ అవి మీ పాయువు చుట్టూ ఉన్న రక్త నాళాలలో పెరిగే ఒత్తిడితో సంబంధం కలిగి ఉంటాయి. ఒత్తిడి మీ వెనుక భాగంలోని రక్తనాళాలలో వాపు మరియు మంటకు కారణమవుతుంది.

సుదీర్ఘకాలం మలబద్ధకం కారణం చేత టాయిలెట్లో చాలా ఒత్తిడికి గురవడం వలన ఇలాంటి సమస్య సంభవిస్తుంది. మనం తినే ఆహారంలో ఫైబర్ లేకపోవడం వలన ఇది తరచూ సంభవిస్తుంది.

దీర్ఘకాలిక అతిసారం (డయేరియా) కూడా హేమోరాయిడ్ సమస్యకు కారణం అవుతుంది.

ఇతర కారణాలు

 • అధిక బరువు లేదా ఊబకాయం.
 • ప్రెగ్నెన్సీ – మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ పెల్విక్ రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది, దీని వలన అవి ఎన్లార్జ్ అవుతాయి.
 • వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి రావచ్చు.
 • ప్రస్తుతం మారుతున్న జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లు.
 • తక్కువ ఫైబర్ ఆహారం – తగినంత పీచు తినకపోవడం వలన మీ కండరాలు గెట్టిగా మారి, మీరు టాయిలెట్ వెళ్ళేటప్పుడు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. చివరికి ఇది పైల్స్ కి దారి తీస్తుంది.
 • క్రమంగా భారీ వస్తువులను ఎత్తడం వలన మీ పెల్విక్ మరియు రెక్టల్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగి మొలలు ఏర్పడవచ్చు.
 • నీరు తక్కువగా త్రాగడం, మద్యం అతిగా సేవించటం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం, మాంసాహారం తరచుగా తినటం వంటివి పైల్స్ రావటానికి ముఖ్య కారణాలు.
 • వయస్సు – మీకు వయసు అయ్యే కొద్ది మీ శరీరం యొక్క కణజాలాలు బలహీనం అవుతాయి. ఈ కారణం వలన కూడా మీకు పైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
 • నిరంతర దగ్గు లేదా వాంతులు.
 • దీర్ఘకాలం కూర్చొని ఉండటం.

మూలశంక వచ్చిన వారిలో ఉండే లక్షణాలు

అనేక సందర్భాల్లో, ఇవి ఎటువంటి లక్షణాలనూ చూపవు మరియు కొంత మంది పైల్స్ ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేరు. కానీ సింటమ్స్ చూపినట్లయితే క్రింద చెప్పిన లక్షణాలను గమనించవచ్చు.

 • మల విసర్జన సాఫీగా జరుగదు.
 • విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట కలుగుతుంది.
 • మల విసర్జన సమయంలో అప్పుడప్పుడు రక్తం పడుతుంది (రక్తస్రావం).
 • విసర్జన అనంతరం కూడా కొందరిలో నొప్పి మరియు మంట రెండు గంటల వరకు ఉంటుంది.
 • మీ క్రింది భాగం ఎప్పుడూ దురదగా ఉంటుంది.
 • మల విసర్జన తరువాత శ్లేష్మం కనపడవచ్చు.
 • విరోచనం కాకపోవడం బాధను కలిగిస్తుంది.
 • సుఖ విరోచనం కాకపోవడంతో చిరాకుగా కోపంగా ఉంటారు.
 • మల విసర్జన సమయంలో మొలలు (పైల్స్‌) బయటకు పొడుచుకొని వచ్చి బాధిస్తాయి.
 • ఈ సమస్య ఉన్నవారు చురుకుగా ఉండలేరు. ఎక్కువ ప్రయాణాలు చేయలేరు.

ఎప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి?

ఎక్కువ నొప్పి కలిగినట్లయితే, విసర్జన సమయంలో రక్తస్రావం లేదా మీ పాయువులో దీర్ఘ కాలం గడ్డలు ఉన్నట్లయితే ఒక వైద్యుడిని వెంటనే సంప్రదించండి. గమనిక : మూత్ర విసర్జన సమయంలో మెరూన్ రంగులో విసర్జన అవుతున్నట్లయితే, ఇది రక్తస్రావం యొక్క సూచన.

పైల్స్ ని నివారించేందుకు తినాల్సిన ఆహార పదార్థాలు?

పైల్స్ చికిత్సలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన ఆహారం తీసుకోవటం వలన ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు.

ఆకుపచ్చ కూరగాయలు

బ్రోకలీ, ఉల్లిపాయలు, దోసకాయలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, పుట్టగొడుగు వంటి విటమిన్లు మరియు ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆకుపచ్చ కూరగాయలను అధికంగా తీసుకోండి.

బొప్పాయి

వీలైతే, బొప్పాయిని రోజూ తీసుకోండి. ఈ పండులో ఫైబర్, విటమిన్ సి, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కనుక, మీరు ప్రతి రోజూ 1 లేదా 2 ముక్కలను తినటం వలన పైల్స్ యొక్క సమస్య తగ్గుతుంది మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అరటి పండు

ఇందులోని విటమిన్లు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది మరియు క్రమంగా పైల్స్ ని తొలగించటంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండును తినండి.

బ్రౌన్ రైస్

పైల్స్ తో బాధపడుతున్న రోగులకు బ్రౌన్ రైస్ చాలా ముఖ్యమైన ఒక ఆహార పదార్థం. పాలిష్డ్ బియ్యంకు బదులుగా ఇటువంటి ఆరోగ్యకరమైన బియ్యంను ఉపయోగించటం ఉత్తమం.

నీరు

మీరు నిజంగా పైల్స్ వదిలించుకోవాలని కోరుకుంటే నీటిని ఎక్కువగా త్రాగండి. నీరు త్రాగడం వల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ అధికరించి పైల్స్ సమస్యను తొలగిస్తుంది.

ఫైబర్ ఆహారాలు

పైల్స్ ని నివారించేందుకు కచ్చితంగా తీసుకోవలసినవి ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఇవి మీ జీర్ణ వ్యవస్థను మెరుగు పరిచి నొప్పిని తగ్గించి క్రమంగా పైల్స్ ని తొలగిస్తుంది.

 • రిఫైన్ చేయని గోధుమ ఆహారాలు, ఉదాహరణకు గోధుమ బియ్యం, ఎండబెట్టిన బీన్, బార్లీ మరియు కాయధాన్యాలు వంటివి.
 • ఆపిల్, పాలకూర, నారింజ, పీచ్, పుట్టగొడుగులు, ఓక్రా, తీపి బంగాళదుంపలు మరియు రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు మరియు కూరగాయలు. పండ్ల రసాలకంటే ఎక్కువ ఫైబర్ కలిగి ఉన్న పండ్లు తినటం చాలా మంచిది.
 • బఠాణీ జాతికి చెందిన బీన్స్, కిడ్నీ బీన్స్, సోయా బీన్స్, బ్లాక్ బీన్స్ లో పీచు అధికంగా ఉంటుంది. ఇవి తేలికగా జీర్ణమై ప్రేగులు శుభ్రపడేలా చేస్తాయి.
 • నట్స్, సీడ్స్, మరియు హుమ్మస్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది.

ఫిగ్ (అంజీర పండు)

అంజీర పండుని రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే మలబద్ధకం మరియు పైల్స్ వ్యాధి నయమవుతుంది. ఆ నీటిలో సగభాగం ఉదయం, సగభాగం సాయంత్రం తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

దానిమ్మ

హెమోరాయిడ్కు మరో చక్కటి హోం రెమిడీ ఎర్రని పండ్ల తొక్క. కొన్ని నీళ్ళలో దానిమ్మ తొక్కను వేసి బాగా ఉడికించి, వడగట్టి రోజుకు ఒకటి రెండు సార్లు త్రాగుతుండాలి.

అల్లం మరియు నిమ్మరసం జ్యూస్

డీహైడ్రేషన్ కూడా పైల్స్ కు ఒక ప్రధానకారణం. అందువల్ల అల్లం, నిమ్మరసం, తేనె కలిపిన జ్యూస్ చేసుకొని ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి.

ముల్లంగి రసం

పైల్స్ నివారించడానికి ఒక గ్లాసు ముల్లంగి రసం చాలా అద్భుతంగా పని చేస్తుంది. ముందుగా ¼ కప్పుతో ప్రారంభించి, రోజు రోజుకూ అర కప్పు రసంను పెంచుకుంటూ పోవాలి.

పచ్చి ఉల్లిపాయ

మలంలో రక్తం పడటం వంటి సమస్యలను నివారించడానికి పచ్చి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తస్రావాన్ని తగ్గించి పాయువు నొప్పిని తగ్గిస్తుంది.

పసుపు

పసుపులో అనేక వైద్య లక్షణాలు ఉంటాయి. మీరు సహజంగా పైల్స్ ను నివారించాలనుకుంటే పసుపు కొమ్ము లేదా పసుపును నీటిలో వేసి ఆ నీటిని తాగండి.

పైల్స్ తో బాధపడుతున్నప్పుడు తిన కూడని ఆహారాలు?

రెడ్ మీట్

ఎరుపు మాంసం చాలా హానికరమైన ఆహారం, ప్రత్యేకంగా మీరు పైల్స్ వలన బాధపడుతున్నప్పుడు తినకూడని ఆహారం ఇది. అలాగే ప్రాసెస్ చేయబడిన మాంసం కూడా తినకూడదు.

బేకరీ ఫుడ్స్

పీస్, పఫ్స్, కేకులు, పాస్ట్రీస్, పిండి రొట్టె మొదలైన బేకరీ ఆహార పదార్థాలను తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి.

స్పైసి ఫుడ్

ఎర్ర మిరప, ఘాటైన మిరియాలు మరియు ఇతర స్పైసెస్తో కూడిన మసాలా ఆహార పదార్థాలను నివారించాలి. ఇటువంటి మసాలా ఆహారాలను తినకూడదని వైద్యులు కూడా సిఫార్సు చేస్తారు. ఇవి మీ కడుపులో మంటని పుట్టించి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన మరియు ఉడికించిన ఆహారాన్ని తినడం మంచిది. ఎక్కువ నూనె మరియు మసాలా దినుసులు లేకుండా కూరగాయలు, పండ్లు మరియు ఇతర తృణధాన్యాలు తీసుకోండి.

లిక్విడ్ వేస్

కాఫీ మరియు ఆల్కహాల్ వంటి కెఫిన్ పానీయాలు హెమోర్రాయిడ్లను మరింత తీవ్రం చేస్తాయి.

కొవ్వు ఆహార పదార్థాలు

కొవ్వు పదార్ధాలు జీర్ణ వ్యవస్థకు పనిని పెంచుతాయి మరియు కడుపు నొప్పి, గుండెల్లో మంట అలాగే హెమరాయిడ్ ప్రమాదాన్ని పెంచుతాయి. డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని నివారించండి. తక్కువ వెన్నని ఉపయోగించడం మరియు తక్కువ కొవ్వు లేదా కొవ్వు లేని పాల ఉత్పత్తులకు మారండి.

పాలిష్డ్ రైస్

పాలిష్ చేయబడిన తెల్లటి రైస్ లో న్యూట్రిషన్స్ మరియు ఫైబర్ తొలగించబడి ఉంటాయి. వీటిలో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది.

పైల్స్ ని తగ్గేందుకు కొన్ని చిట్కాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • వ్యాయామం : మలబద్దకం నివారించడానికి మరియు శరరంలో క్రమంగా రక్త ప్రసరణ జరగడానికి రెగ్యులర్ వ్యాయామం బాగా సహాయపడుతుంది. గమనిక : అతిగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువ బరువులను మోయడం వల్ల కూడా హెమరాయిడ్స్ అధికం కావచ్చు. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ లాంటివి కాకుండా యోగా, స్విమ్మింగ్, వాకింగ్ వంటి సాధారణ వ్యాయామాలను చేయండి.
 • టాయిలెట్ పొజిషన్ : టాయిలెట్ పొజిషన్ సరిగ్గా ఉండాలి. కూర్చొనే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇబ్బంది పడనవసరం లేదు. టాయిలెట్ స్టెప్ మీద కరెక్ట్ గా కాలు పెట్టి కూర్చొని ముందుగా వంగడం వల్ల రెక్టమ్ మీద ప్రెషర్ తగ్గుతుంది.
 • మీరు అర్జంట్గా విసర్జనకు వెళ్ళవలసి ఉన్న సమయంలో కంట్రోల్ చేసుకోకుండా వెంటనే టాయిలెట్కు వెళ్ళండి. వాటిని ఆపాలని ప్రయత్నించటం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి.
 • మల విసర్జన సమయంలో మీ పురీషనాళంపై ఎక్కువ ఒత్తిడిని పెట్టకూడదు. ఒత్తిడి నొప్పి మరియు పైల్స్ రక్తస్రావంకు దారి తీస్తుంది.
 • పీచు (ఫైబర్) పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి (కనీసం రోజుకు 4 నుండి 5 లీటర్లు).
 • రోజూ మల విసర్జన సాఫీగా జరిగేట్టు చూసుకోవాలి.
 • మద్యం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, మాంసాహరం, చిరుతిళ్లు మానేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు బాగా విశ్రాంతి తీసుకోవాలి, నిత్యం యోగా, మెడిటేషన్‌ చేయాలి.
 • సరైన సమయంలో డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్సని తీసుకోండి.