Posted on

Want to go to Goa with family in Telugu – గోవా యొక్క వివరాలను తెలుసుకున్నారా?

గోవా భారతదేశంలో పశ్చిమ తీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. ఇది దేశంలో వైశాల్య పరంగా రెండవ అతి చిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతి చిన్న రాష్ట్రం. గోవా రాజధాని ‘పనజీ’. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకున్నారు. కొద్ది కాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నారు. 450 సంవత్సరాల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనిక చర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకొన్నది. వలస పాలకులు చివరి వరకూ మన దేశంలో వదలని ప్రాంతం గోవా. చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపదలతో గోవా మంచి పర్యాటక కేంద్రంగా ఏర్పడింది.

గోవా అనగానే మొదట ఉత్సాహం చెందేవారు యువకులు. ఎందుకంటే అక్కడి క్యాసినోలు, కార్నివాల్స్‌, పబ్బులు మరియు పార్టీలు వారిని ఆకర్షిస్తాయి. గోవా అనగానే ఇవే ఉంటాయని చాలా మంది అభిప్రాయం కూడా. కానీ, ఈ చిట్టి రాష్ట్రంలో ఇంతకు మించిన విశేషాలున్నాయి. ప్రకృతి రమణీయత, సుందర తీరాలు, నిర్మలమైన సూర్యాస్తమయాలు, సాగర హోరులో సాగే సాహసాలు… ఇలా ఎన్నో! ఇవన్నీ అన్ని వయసుల వారినీ అలరించేవే. కుటుంబ విహారమైనా, స్నేహితులతో సరదా ట్రిప్పయినా అనుకూల పర్యాటక కేంద్రమిది. కనుక ఈసారి గోవాకు కుటుంబంతో వెళ్లండి.

ఆహ్లాద పరిచే కొబ్బరి తోటలు, ఆ తోటల నడుమ అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉండే రంగు రంగుల ఇళ్లు, చూసినన్ని చారిత్రక వారసత్వ కట్టడాలు,  జాలీ స్పాట్‌లు ఇలా విహార పర్వం విజయవంతం చేసే నెలవులెన్నో గోవాలో ఉన్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో యువత కేరింతలతో ఊగిపోయే గోవా… ఫిబ్రవరి, మార్చి నెలల్లో అందరి విహార కేంద్రమవుతుంది. వినోదాల్లో తేలిపోయే కుటుంబాలు, అలల ఆలింగనంతో చెదిరిపోయే కొత్త జంటల పాదముద్రలతో సుందర తీరం మరింత మనోహరంగా కనిపిస్తుంది. మరి ఈ ప్రదేశం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

గోవా చేరుకోవడం ఎలా?

ముందుగా గోవా కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

 • హైదరాబాద్‌ నుంచి గోవాకు నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి. ప్రైవేట్‌ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా విహారం కొనసాగించవచ్చు.
 • గోవా ప్రాంతంలో కులెం, మాడ్‌గావ్‌, వాస్కో డా గామా రైల్వేస్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా స్టేషన్లలో దిగి ట్యాక్సీలో గోవా తీరాలకు చేరుకోవచ్చు.

గోవా లో ఎక్కడ స్టే చేయాలి?

గోవాలో అన్ని వర్గాల వారికీ అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబసభ్యులతో సందర్శించే వారికి రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించే అతిథిగృహాలు మొదటి ఎంపిక. ఆన్‌లైన్‌ బుకింగ్‌తో తక్కువలోనే మంచి డీల్స్‌ సొంతం చేసుకోవచ్చు. అద్దె రోజుకు రూ.500 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది.

గోవా లోని ఆకర్షణలు

 1. క్రూయిజ్‌ విహారం : గోవాలో క్రూయిజ్‌ విహారం మరచిపోలేని అనుభూతినిస్తుంది. అరేబియా సముద్రం, మండోవి నదిపై సాగుతూ ప్రకృతి ఒడిలో తేలిపోవచ్చు. క్రూయిజ్‌ డెక్‌ పైన స్థానిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ పెద్దలు కూడా పిల్లలు అయిపోతారు.
  ధర: రూ.300 (ఒక్కొక్కరికి)
 2. దక్షిణ తీరాలు : గోవాలో 125 కి.మీ. పొడవునా తీరాలు విస్తరించి ఉన్నాయి. వీటిని ఉత్తర, దక్షిణ తీరాలుగా విభజన చేశారు. పార్టీలు, కార్నివాల్స్‌, సాహస విన్యాసాలకు ఉత్తర తీరాలు కేరాఫ్‌గా నిలిస్తే, ప్రశాంతంగా సేద తీరడానికి దక్షిణ తీరాలు అనువుగా ఉంటాయి. దక్షిణ తీరాల్లో పాలొలెమ్‌ బీచ్‌ ముఖ్యమైంది. ఇక్కడ సముద్ర జలాలు స్వచ్ఛంగా ఉంటాయి. ఒడ్డున చిన్న చిన్న కుటీరాలు, ఆయుర్వేద కేంద్రాలున్నాయి. ఉదయాన్నే యోగా తరగతులు నిర్వహిస్తుంటారు. మంకీ ద్వీపం, కోటిగావో వన్యప్రాణుల అభయారణ్యం ఇక్కడికి సమీపంలో ఉంటాయి. ఇదే వరుసలోని అగొందా బీచ్‌ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తర తీరాల్లో కాలన్‌గూట్‌ ప్రధానమైనది. ‘బీచ్‌ల మహారాణి’గా పేరున్న ఈ తీరం ప్రపంచంలో అందమైన పది బీచ్‌లలో ఒకటి. దీనికి సమీపంలోని బాగా బీచ్‌ బాగుంటుంది. ఇదే వరుసలో కొండల శ్రేణుల మధ్య ఉండే అంజునా గ్రామంలో ప్రకృతి అందాలు పరవశింపజేస్తాయి.
 3. జల క్రీడలు : గోవా సందర్శనలో జలక్రీడలు ప్రత్యేక అంకం. సినిమాల్లో చూసే ఫీట్లు ఇక్కడ చేసేయొచ్చు. విండ్‌ సర్ఫింగ్‌, డింగై సెయిలింగ్‌, యాంగ్లింగ్‌, వాటర్‌ స్కూటర్‌ వంటి ఆటలు రోజులను క్షణాల్లా కరిగించేస్తాయి.
  • కండోలిం, బాగా, వగేటర్‌ బీచ్‌లలో జెట్‌ స్కీయింగ్‌ – ధర: రూ. 1,200 నుంచి ప్రారంభం.
  • అంజునా, వగేటర్‌ బీచ్‌లలో పారాసెయిలింగ్‌ – ధర: రూ.1,500
  • మండోవి నది, వగేటర్‌ బీచ్‌ లో వాటర్‌ రాఫ్టింగ్‌ – ధర: రూ.1,800
  • వాస్కో సమీపంలోని గ్రాండ్‌ ఐలాండ్‌ లో స్కూబా డైవింగ్‌ – ధర: రూ.2,500- రూ.4,000 మరియు స్నోర్కెలింగ్‌ ధర: రూ.1,000
 4. అగువాడ కోట : అరేబియా అలల తాకిడిని తట్టుకునేలా, 79 ఫిరంగులతో ‘అగువాడ’ కోటని నిర్మించారు. సిన్క్వురియం, కండోలిం బీచ్‌లను విభజించే కోట లోపల 1864లో నిర్మించిన లైట్‌ హౌస్‌ ఆకట్టుకుంటుంది. సూర్యాస్తమయాన ఈ ఎర్రటి కోట యొక్క అందం రెట్టింపవుతుంది. ఉదయాన్నే బీచ్‌లను సందర్శించే యాత్రికులు మధ్యాహ్నం అయ్యేటప్పటికి కోటలో రిలాక్స్ అవుతారు.
 5. బోమ్‌ జీసస్‌ బాసిలికా చర్చి : కేథలిక్‌ల ఆరాధ్య కేంద్రమైన బోమ్‌ జీసస్‌ బాసిలికా చర్చిని 1605లో కట్టారు. బరోక్‌ నిర్మాణ శైలిలో కట్టిన ఈ అద్భుత చర్చిని రోజూ వేల మంది సందర్శిస్తుంటారు. చర్చి ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉంటుంది.
 6. సంత : గ్రామ సంతలు గోవాలో మరో ప్రత్యేకత. ఇక్కడ చవక ధరల్లో షాపింగ్‌ చేయవచ్చు. సాధారణంగా ఈ సంతలు కండోలిం, అంజునా చెంత నిర్వహిస్తారు. శనివారాలు సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల మార్కెట్‌ కూడా ఉంటుంది. అంజునా బీచ్‌లో ప్రతి బుధవారం ఫ్లీ (బేరసారాల) మార్కెట్‌ జరుగుతుంది. తక్కువ ధరల్లో అద్భుతమైన వస్తువులు కొనొచ్చు.

తప్పక చూడాల్సిన మరి కొన్ని ప్రదేశాలు

 • గోవాలో సలీం అలీ పక్షుల సంరక్షణ కేంద్రం తప్పక చూడాలి.
 • గోవా-కర్ణాటక సరిహద్దులోని మండోవి నదిపై ఉన్న దూద్‌సాగర్‌ జలపాతం అద్భుతమైన ప్రకృతి దృశ్యం. 1,017 అడుగుల ఎత్తు నుంచి నిటారుగా దూకే జలధారలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.
 • గోవాలో ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపి ద్విచక్రవాహనాలు అద్దెకు తీసుకోవచ్చు. అద్దె రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది.
 • గోవాలో రాత్రుళ్లు అద్భుతంగా ఉంటాయి. టిటో స్ట్రీట్‌ క్లబ్బులకు పెట్టింది పేరు. తెల్లవారుజాము వరకూ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. తీరంలోని కాటేజీల్లోనూ పార్టీలు నిర్వహిస్తుంటారు.

సముద్రం బ్యాక్‌వాటర్‌లో భారీ ఓడల్లో ఏర్పాటు చేసిన క్యాసినోలు (జూద శాలలు) ఆకర్షిస్తుంటాయి. కుటుంబాలతో కూడా వీటిల్లోకి వెళ్లొచ్చు. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా కేర్‌ సెంటర్లు ఉంటాయి. భారీ బఫేలు, రకరకాల చిరుతిళ్లు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నిటికీ ధర: ఒకరికి రూ.1,500 నుంచి ప్రారంభం.